ఎవరిదీ పాపం

ABN , First Publish Date - 2021-11-10T17:44:35+05:30 IST

దీపావళి (ఈ నెల 4న) రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లో వెలుగుచూసిన బాలిక మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే, బాలికను హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆరు

ఎవరిదీ పాపం

ఆ బాలికది హత్యే.. 

ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితులు

తెలిసిన వారి పనేనని పోలీసుల అనుమానాలు

సీసీ ఫుటేజీల్లో ఓ మహిళ, వ్యక్తి ఆనవాళ్లు


హైదరాబాద్‌ సిటీ: దీపావళి (ఈ నెల 4న) రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లో వెలుగుచూసిన బాలిక మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే, బాలికను హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల వివరాలు తెలియలేదు. ఆధారాలు దొరక్కుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. ఫోన్‌ ద్వారా గుర్తించే అవకాశముందని భావించి నిందితులు ఫోన్‌లు వాడకుండానే బాలికను అక్కడ పడేసి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయో ముందే తెలుసుకుని వాటికంట పడకుండా జాగ్రత్త పడినట్లు భావిస్తున్నారు. అయినా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా బురఖా ధరించి వచ్చిన మహిళతో పాటు మరో వ్యక్తి బాలిక మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లోని జలగం వెంగళరావు పార్కు ఎదురుగా ఉన్న మిడ్‌ టౌన్‌ భవనం సమీపంలో కొన్ని రోజులుగా మూసి ఉంటున్న దుకాణం షెట్టర్‌ ఎదురుగా ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, కడుపులో బలంగా తన్నడంతోనే ఆమె మృతి చెంది ఉండవచ్చని, ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని గుర్తించారు. సంఘటన జరిగిన ప్రాంతం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టగా ఓ మహిళ, వ్యక్తి ఆనవాళ్లు కనిపించాయి. నగర, శివారు ప్రాంతాల్లోని పోలీ్‌సస్టేషన్లలో బాలిక అదృశ్యం ఫిర్యాదులు కూడా రాకపోవడంతో ఇది తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇతర రాష్ట్రం నుంచి వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. నిందితులు ఎంత తెలివిగా వ్యవహరించినప్పటికీ త్వరలోనే పట్టుకుంటామని ఓ అధికారి తెలిపారు.

Updated Date - 2021-11-10T17:44:35+05:30 IST