ప్రేమకు అడ్డొస్తోందనే ఘాతుకం?

ABN , First Publish Date - 2021-10-20T18:03:26+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ చింతల్‌మెట్‌లో సోమవారం ప్రియుడితో కలసి తల్లిని హత్య చేసిన కూతురు, ఆమెకు సహకరించిన యువకుడు ఇద్దరూ మేజర్‌ లేనని పోలీసులు

ప్రేమకు అడ్డొస్తోందనే ఘాతుకం?

తల్లిని హత్య చేసిన కేసులో ఇద్దరూ మేజర్లే 

హైదరాబాద్‌ సిటీ/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ చింతల్‌మెట్‌లో సోమవారం ప్రియుడితో కలసి తల్లిని హత్య చేసిన కూతురు, ఆమెకు సహకరించిన యువకుడు ఇద్దరూ మేజర్‌ లేనని పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన రోజు నిందితులిద్దరూ మైనర్లు అని చెప్పిన పోలీసులు.. వారి ఆధార్‌ కార్డులను పరిశీలించి, మేజర్లుగా తేల్చారు.   తన ప్రేమకు అడ్డొస్తోందనే ప్రియుడితో కలిసి కూతరు తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. చింతల్‌మెట్‌ బస్తీలో నివసించే యాదమ్మ(45), యాదయ్యకు ముగ్గు రు కుమార్తెలు. ఒక కూమార్తె చనిపోయింది. పెద్ద కుమార్తె వివాహం జరిగింది. మూడో కుమార్తె నందిని(20)తో కలసి ఉంటున్నారు. నందినికి రెండేళ్ల క్రితం స్థానికంగా ఉండే రాంస్వరూప్‌ కుమారుడు రాంకుమార్‌ అలియాస్‌ చోటు(19)తో పరిచయం ఏర్పడింది. అతను  ఇండెన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌. ఇద్దరూ  ప్రేమించుకుంటున్నారు. నందిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతను వచ్చి వెళ్తుండేవాడు. విషయం  తెలిసి తల్లి  రెండు మూడు సార్లు కూతురిని మందలించింది. అయినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు  నందిని ఇంట్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తల్లి వచ్చింది. దీంతో రామ్‌కుమార్‌ పారిపోయాడు. అనంతరం యాదమ్మ కూతురిని తీవ్రంగా మందలించింది.  దాంతో కోపంతో ఊడిపోయిన నందిని తల్లిపై తిరగబడింది. ప్రియుడికి ఫోన్‌ చేసి గొడవ గురించి చెప్పి, పిలిచింది. అప్పటికే కొద్దిగా మద్యం మత్తులో ఉన్న యాదమ్మపై కూతురు  ప్రియుడితో కలిసి దాడిచేసింది. రామ్‌కుమార్‌ యాదమ్మను కిందపడేసి బలంగా కొట్టాడు. నందిని చున్నీతో తల్లి మెడకు ఉరిబిగించగా ఇద్దరూ కలిసి గట్టిగాలాగి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. 


ఏమీ తెలియనట్లు కూర్చొని..

ఇంట్లో తల్లి శవం ఉన్నా.. తనకేమీ తెలియనట్లు నందిని బయటకు వచ్చి కూర్చున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన యాదమ్మ భర్త యాదయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా భార్య మరణించి ఉంది. వెంటనే నందిని అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. స్థానికుల ద్వారా ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకుని యాదయ్య రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితులకోసం గాలిస్తున్నామని, ఏ క్షణమైనా అరెస్టు చేస్తామని రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య, అత్తాపూర్‌ ఔట్‌పోస్టు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2021-10-20T18:03:26+05:30 IST