హైదరాబాద్‌లో స్నేహితుడినే కిడ్నాప్‌ చేసిన కార్పొరేటర్‌

ABN , First Publish Date - 2020-10-22T03:20:37+05:30 IST

ఓ భర్త భార్యను కిడ్నాప్‌ చేశాడు. పోలీసులు హైరానా పడ్డారు. కానీ, దంపతులు ఇద్దరూ కలిసే ఈ ప్లాన్‌ వేశారని తెలిసి విస్తుపోయారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో స్నేహితుడినే కిడ్నాప్‌ చేసిన  కార్పొరేటర్‌

ఓ భర్త భార్యను కిడ్నాప్‌ చేశాడు. పోలీసులు హైరానా పడ్డారు. కానీ, దంపతులు ఇద్దరూ కలిసే ఈ ప్లాన్‌ వేశారని తెలిసి విస్తుపోయారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో హేమంత్‌ కిడ్నాప్‌, హత్య ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు... హైదరాబాద్‌లో ఓ కార్పొరేటర్‌ తన స్నేహితుడినే కిడ్నాప్‌ చేశాడు.


వికారాబాద్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 27వ తేదీన వివాహిత కిడ్నాప్ కలకలం రేపింది. దీపిక, అఖిల్‌ అలియాస్ ఖలీల్, 2016లో ఆర్య సమాజ్‌లో మతాంతర వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక తన సోదరితో  షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని కిడ్నాప్ చేసి కారులో పడేశారు.  పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి కారుతో పరారయ్యారు. దీనిపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. 


అయితే, రెండు రోజుల తర్వాత పోలీసులు నమ్మలేని విషయం తెలుసుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసింది ఆమె భర్తే అని తేల్చారు. వికారాబాద్‌లో కిడ్నాప్ అయిన మహిళ తన భర్తతో కలిసి నేరుగా హైదరాబాద్ చేరుకుంది. అక్కడ నుండి తన సమీప బంధువులు ఉండే సిద్దిపేటకి చేరుకున్నారు. అక్కడ దంపతులిద్దరూ తలదాచుకున్నారు. పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు భార్యాభర్తలిద్దరినీ వికారాబాద్‌కి  తీసుకొచ్చారు. అయితే, భర్త చేయించిన కిడ్నాప్ డ్రామా గురించి భార్యకు కూడా ముందే తెలుసనీ తేల్చారు. పుట్టింట్లో ఉండటానికి భార్యకు ఇష్టం లేకపోవడంతో భర్త సహాయంతోనే ఈ ప్లాన్‌ చేసినట్లు గుర్తించారు.


ఇక, ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కూతురి భర్తను కిడ్నాప్‌ చేసి.. హత్య చేయించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టించింది. మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసును తలపించిందీ సంఘటన. హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన హేమంత్‌, అదే కాలనీలో నివసించే యువతి ప్రేమించి పెద్దలను కాదని కులాంతర వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో కాపురం సజావుగానే సాగుతోంది. హేమంత్‌ పెద్దలు ఈ వివాహాన్ని అంగీకరించి.. దంపతులకు అండగానే నిలిచారు. కానీ, యువతి తల్లిదండ్రులు మాత్రం లోలోపలే రగిలిపోయారు. తమ పరువు పోయిందని కుతంత్రానికి తెర తీశారు. యువతి తండ్రి, మేనమామ కలిసి అరాచకానికి ప్లాన్‌ చేశారు. యువతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్‌రెడ్డి కిరాయి హంతకులను ఎంపిక చేశారు. పదిలక్షల రూపాయలు చెల్లించేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నారు. హేమంత్‌ కిడ్నాప్‌, హత్యకు పక్కాగా ప్లాన్‌ వేశారు.


కిడ్నాపర్లు యువతి తల్లిదండ్రులతో మాట్లాడుకుందామని చెప్పి హేమంత్‌ను, అతని భార్యను కిడ్నాప్‌ చేశారు. అయితే, హేమంత్‌ భార్య కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకుంది. హేమంత్‌ కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. మరో గ్యాంగ్‌ వెంబడించి అతన్ని పట్టుకుంది. హేమంత్‌ను కారులో సంగారెడ్డి వైపు తీసుకెళ్లారు. 




కారులో తీసుకెళ్తున్న సమయంలోనే హేమంత్‌ను కిడ్నాపర్లు చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత తాడుతో గొంతు నులిమి హత్య చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన తర్వాత హేమంత్‌ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు .. అక్కడ నుండి సుపారీ గ్యాంగ్ పరారైంది. 


హేమంత్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమె తండ్రి , మేనమామను అదుపులోకి తీసుకొని విచారిస్తే కథ మొత్తం బయట పడింది. ఈ కిడ్నాప్, హత్య కేసులో మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ప్రేమ వివాహం, ఆర్థికంగా హేమంత్ కుటుంబం బలహీనంగా ఉండటం, అలాగే కులాంతర వివాహం కావడం తోనే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు.


ఇక, హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. కార్పొరేటర్‌తో పాటు అతని మనుషులు కిడ్నాప్ చేసి ఆ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. 


బోడుప్పల్ ఆరవ డివిజన్‌లో దుర్గాప్రసాద్‌ అనే యువకుడిని కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డారనే కేసులో చైతన్యపురి పోలీసులు కార్పొరేటర్‌ తోటకూర అజయ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఇంటికి వచ్చి బలవంతంగా తనను కారులో ఎక్కించుకొని మద్యం తాగుతూ సిటీ అంతా తిప్పుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇద్దరి మధ్యా ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు


కార్పొరేటర్ తోటకూర అజయ్, బాధితుడు దుర్గాప్రసాద్ కాలేజీలో క్లాస్‌మేట్స్‌ అని పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్‌ అజయ్‌కి దుర్గాప్రసాద్‌ బిబిఎ సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసి ఇప్పించాడు. అజయ్‌ ఆ సర్టిఫికెట్లతోనే ఎన్నికల్లో గెలిచాడని, ఆ విషయం బయటకు చెబుతానని దుర్గాప్రసాద్‌ బెదిరించడంతో.. అజయ్‌, తన స్నేహితులతో కలిసి దుర్గాప్రసాద్‌ను కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. అయితే, అజయ్‌ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఫోర్జరీ సర్టిఫికెట్ల వ్యవహారం కూడా బయటకు వస్తుందని భావిస్తున్నారు. 


- సప్తగిరి గోపగాని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-22T03:20:37+05:30 IST