HYD : దొంగ దంపతులు.. Corona రోగుల బంగారమే టార్గెట్‌!

ABN , First Publish Date - 2021-07-10T19:50:33+05:30 IST

అవకాశం చిక్కినప్పుడల్లా స్పృహలో లేని రోగుల శరీరంపై ఉన్న ఆభరణాలను కొట్టేశారు

HYD : దొంగ దంపతులు.. Corona రోగుల బంగారమే టార్గెట్‌!

  • టిమ్స్‌లో పేషెంట్‌ కేర్‌ అటెండర్స్‌గా పని చేస్తూ దొంగతనాలు
  • నిందితుల అరెస్ట్‌
  • రూ. 10 లక్షల విలువైన బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : పేషెంట్‌ కేర్‌ అటెండర్స్‌గా పని చేస్తున్న ఆ దంపతుల కళ్లు కరోనా రోగుల ఒంటిపై ఉన్న బంగారంపై పడ్డాయి. అవకాశం చిక్కినప్పుడల్లా స్పృహలో లేని రోగుల శరీరంపై ఉన్న ఆభరణాలను కొట్టేశారు. ఇలా నెల రోజుల్లో రూ. 10 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి దోచుకున్నారు. విపత్కర పరిస్థితిలో బాధితులు ఆవేదనలో ఉంటే, రోగులకు సేవ చేయాల్సిన ఈ ఇద్దరూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా ధర్మపురికి చెందిన చింతలపల్లి రాజు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. మొదటి భార్యతో విడిపోయిన రాజు హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటూ ఓలా క్యాబ్‌ నడుపుతున్నాడు. అతనికి 2017లో లతాశ్రీ అనే మహిళ పరిచయమైంది. ఆమె భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగానే ఉంటోంది. ఇద్దరూ రెండో పెళ్లి చేసుకొని కూకట్‌పల్లి రాజీవ్‌ గృహకల్ప ప్రాంతంలో ఉంటున్నారు. కరోనా, లాక్‌డౌన్‌తో క్యాబ్‌ తిరగక రాజుకు ఆదాయం లేదు. ఈ క్రమంలో టిమ్స్‌లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని క్యాబ్‌లో డ్యూటీకి తీసుకెళ్లి, తీసుకొచ్చే పని దొరికింది. తన క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది సహకారంతో తన భార్య లతాశ్రీని టిమ్స్‌లో పేషెంట్‌ కేర్‌ అటెండర్‌గా చేర్పించాడు. ఆ తర్వాత తాను కూడా పేషెంట్‌ కేర్‌ అటెండర్‌గా చేరాడు.


పథకం ప్రకారం దోచేశారు.. 

కరోనా విజృంభణ సమయంలో టిమ్స్‌కు కొవిడ్‌ రోగుల తాకిడి పెరిగింది. వందలాది మంది పేషెంట్లు చేరేవారు. ఈ దిశలో ఆ దంపతుల దృష్టి మహిళా పేషెంట్ల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. పేషెంట్లు స్పృహలో లేని సమయంలో లతాశ్రీ గదిలోకి ఎవరూ రాకుండా బయట కాపలా కాసేది. రాజు పేషెంట్స్‌ మెడలోని పుస్తెల తాడు, నల్లపూసల గొలుసులు, చేతికి ఉన్న బంగారు గాజులు, కాళ్లకు ఉన్న వెండి కడియాలు దోచేసేవాడు. ఇలా ఏప్రిల్‌ 17 నుంచి మే 19 వరకు నెల రోజుల్లో రూ. 10 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, ఒక మొబైల్‌ ఫోన్‌ దోచేశారు. కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టగానే దంపతులిద్దరూ ఉద్యోగం మానేశారు.


రంగంలోకి దిగిన సీసీఎస్‌..

తమ బంధువుల బంగారం కనిపించడం లేదని బాధితులు గగ్గోలు పెట్టేవారు. కానీ.. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని, డాక్టర్స్‌, నర్స్‌లను విచారించే అవకాశం లేదు. దాంతో పోలీసులు కూడా సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, నర్స్‌ల జాబితాను తీసుకున్నారు. టిమ్స్‌లో సీసీటీవీ కెమెరాలు పెద్దగా లేకపోవడంతో దొంగల గుర్తింపు కష్టంగా మారింది. సీపీ సజ్జనార్‌  కేసును బాలానగర్‌, కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.


జగద్గిరిగుట్ట పోలీసుల చొరవ..

సీసీఎస్‌ పోలీసులు కేసు విచారిస్తుండగానే, జగద్గిరిగుట్ట పోలీసులకు నిందితులకు సంబంధించిన సమాచారం అందింది. టిమ్స్‌లో పేషెంట్‌ కేర్‌ అటెండర్స్‌గా పనిచేసిన దంపతులు తమ ఇంటి మరమ్మతు, అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, అందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. అప్పటి వరకు అప్పుల ఊబిలో ఉన్న వారికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే అనుమానాలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట ఎస్‌హెచ్‌వో సైదులు తన సిబ్బందితో రంగంలోకి దిగారు. 


దంపతులను అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో టిమ్స్‌లో చేసిన బంగారు ఆభరణాల చోరీ గుట్టు రట్టయింది. మొత్తం ఏడుగురు బాధితుల నుంచి బంగారం, సెల్‌ఫోన్‌ దోచుకున్నట్లు నిందితులు వెల్లడించారు. 10 తులాల బంగారం, 80 తులాల వెండిని పోలీసులు రికవరీ చేశారు. కేసును పర్యవేక్షించిన మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్‌రావుతో పాటు జగద్గిరిగుట్ట, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్స్‌, సీసీఎస్‌, పోలీసులను సీపీ సజ్జనార్‌ అభినందించారు. గోల్డ్‌ ఫైనాన్స్‌లో కుదువపెట్టిన బంగారు గాజులను ఒకటి, రెండు రోజుల్లో రికవరీ చేస్తామని మాదాపూర్‌ డీసీపీ వెల్లడించారు.

Updated Date - 2021-07-10T19:50:33+05:30 IST