పాతాళంలోకి హైదరాబాద్‌ క్రికెట్‌

ABN , First Publish Date - 2022-01-27T16:46:38+05:30 IST

గ్రూపు రాజకీయాలతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పరువును బజారు పడేసిన ప్రస్తుత కార్యవర్గం సుప్రీం కోర్టు

పాతాళంలోకి హైదరాబాద్‌ క్రికెట్‌

ఉద్యోగులకు నిలిచిన జీతాలు

హైదరాబాద్‌: గ్రూపు రాజకీయాలతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పరువును బజారు పడేసిన ప్రస్తుత కార్యవర్గం సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తోంది. ప్రస్తుత కార్యవర్గం స్థానంలో రిటైర్డ్‌ న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న సుప్రీం కోర్టు అప్పటివరకు హెచ్‌సీఏ ఉద్యోగుల జీతాలు ఇతరత్రా వ్యయాల నిమిత్తం రోజువారి కార్యకలాపాలకు విఘాతం కలగకుండా అధ్యక్షుడు అజరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ను సంయక్తంగా చెక్కులపై సంతకాలు చేయాల్సిందిగా ఆదేశించింది.


అయితే, అధ్యక్షుడు అందుబాటులో లేడని కార్యదర్శి, కార్యదర్శి స్పందించడం లేదని అధ్యక్షుడు మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయి. దీంతో వంద మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగుల జీతాలకు నెలకు సుమారు రూ.21 లక్షలు ఖర్చు అవుతుందని.. నిధులున్నా రాజకీయాలతో హెచ్‌సీఏ పెద్దలు తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.సమస్యను పరిష్కరించకపోతే విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తామని హెచ్‌సీఏ ఉద్యోగుల సంఘం తెలిపింది. ఈ సమస్యపై రంగారెడ్డి జిల్లా లేబర్‌ కమిషనర్‌ను హెచ్‌సీఏ ఉద్యోగుల సంఘం ఆశ్రయించగా ఈనెల 22న అజర్‌, విజయానంద్‌ను తన కార్యాలయానికి రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. దీనికి ఇద్దరు గైర్హాజరయ్యారు. దీంతో 27వ తేదీన రావాల్సిందిగా మరోసారి ఇరువురికి కమిషనర్‌ నోటీసులు పంపించారు.


బీటలు వారిన పిచ్‌..

అంతర్జాతీయ మ్యాచ్‌లకు, ఐపీఎల్‌ టోర్నీకి వేదికైన హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం హెచ్‌సీఏ పాలకుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా తయారైంది. విద్యుత్‌ బకాయిలు కారణంగా స్టేడియంకు నెలరోజులుగా కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో బోర్లు స్తంభించాయి. ఫలితంగా నీటితో మైదానాన్ని తడిపే ఆస్కారం లేకపోవడంతో ప్రాక్టీస్‌ నెట్లు మొదలు ప్రధాన పిచ్‌ వరకు బీటలు వారాయి. స్టేడియం పరిస్థితి ఇలా వుంటే భవిష్యత్‌లో హైదరాబాద్‌కు మ్యాచ్‌ల ఆతిథ్యానికి అవకాశం వస్తుందా అని నగరానికి చెందిన క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T16:46:38+05:30 IST