హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంపై కొనసాగుతున్న దర్యాప్తు

ABN , First Publish Date - 2020-09-10T12:57:20+05:30 IST

మాదకద్రవ్యాలు గోవా నుంచి నగరానికి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నించిన

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంపై కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌ : మాదకద్రవ్యాలు గోవా నుంచి నగరానికి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు తీగ లాగుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అమీర్‌పేట్‌, బీకేగూడ ప్రాంతానికి చెందిన పిల్లి మనోజ్‌కుమార్‌ అలియాస్‌ బంటి(31)ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అతడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. వచ్చే జీతం ఖర్చులకు, డ్రగ్స్‌ కొనుగోలు చేసేందుకు సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కాడు. గోవాలో డ్రగ్స్‌ చవకగా దొరుకుతాయని స్నేహితుడు చెప్పడంతో అక్కడికి వెళ్లి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన సనత్‌నగర్‌ నివాసి బి.రోహిత్‌(34)ను సంప్రదించాడు.


అతడి సూచన మేరకు మనోజ్‌కుమార్‌, మరో ముగ్గురు స్నేహితులు కలిసి గోవా వెళ్లి విక్రయదారులను కాంటాక్ట్‌ చేశారు. ఐదురోజులు అక్కడే ఉండి డ్రగ్స్‌ తీసుకుని నగరానికి వచ్చారు. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం అందడంతో వారిని పట్టుకున్న విషయం తెలిసిందే. మనోజ్‌కుమార్‌ డ్రగ్స్‌ ఎవరెవరికి విక్రయించాలని నిర్ణయించుకున్నాడనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వారు గతంలో కూడా అక్కడి నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చారా.. ఇదే తొలిసారా అనేది తేలాల్సి ఉంది. కాల్‌ డేటా ఆధారంగా లింక్‌ను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2020-09-10T12:57:20+05:30 IST