Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏడ్చే వాడిని..

చివరి క్షణాలు దగ్గరపడ్డాయనుకున్నా 

ఆత్మస్థైర్యంతో కోలుకున్నా 

లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు 

చికిత్స సమయంలో కుటుంబ సభ్యుల అండ అవసరం  : పట్లోళ్ల నాగిరెడ్డి


హైదరాబాద్/ఫతేనగర్‌: ‘‘కరోనా వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఒక ఎత్తయితే, ఒకవేళ మహమ్మారి బారిన పడితే ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా దాన్ని ఎదుర్కోవడం మరో ఎత్తు’ అంటున్నారు ఫతేనగర్‌ డివిజన్‌ భరత్‌నగర్‌ కాలనీ సంక్షేమ సంఘం అఽధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి. వైరస్‌ సోకితే సానుభూతి వ్యక్తం చేసే కన్నా తామంతా ఉన్నామని వెన్ను తట్టి ధైర్యం చెప్పే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉంటే వైరస్‌ నుంచి ప్రాణాలతో బయట పడొచ్చని సూచిస్తున్నారు. కరోనాకు అసలైన మందు ఆత్మస్థైర్యమే అంటున్న నాగిరెడ్డి అనుభవాలు.. 


ఓ కార్యక్రమంలో

గతేడాది కరోనా వైరస్‌ విస్తరిస్తున్న సమయంలో పారిశుధ్య కార్మికులకు, పేదలకు ఉచితంగా నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేస్తూ పలు కార్యక్రమాలు చేశాను. ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కాస్త నలతగా అనిపించింది. పెద్దగా పట్టించు కోలేదు. రెండు రోజుల తర్వాత జలుబు, జ్వరం వచ్చాయి. అనుమానం వచ్చి వెంటనే కాలనీలో ఉన్న ఓ వైద్యుడిని కలిశాను. అతడు ఆక్సోమీటర్‌తో పరీక్ష చేసి కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ చేయించుకుంటే కరోనా సోకినట్లు తేలింది. వైద్యుల సూచన మేరకు సుచిత్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాను. 

వెంటిలేటర్‌ పెడితో కంపించి పోయా...

ఆస్పత్రిలో చేరగానే ఐసీయూ వార్డులో ఉంచారు. ముక్కుకు, నోటికి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అమర్చారు.  అదంతా చూసి భయంతో కంపించి పోయాను. నా చివరి క్షణాలు దగ్గరపడి పోయాయి అనుకున్నా. గదిలోకి కుటుంబ సభ్యులను అనుమతించక పోవడంతో మరింత భయం వేసింది. భయాన్ని నాలోనే దాచుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకునే వాడిని. భార్యా పిల్లలు ఫోన్‌ చేసిన ప్రతిసారీ చాలా బాగా ఉన్నానని, కోలుకుంటున్నానని చెబుతూ ఆ తర్వాత నా పరిస్థితి చూసుకుని ఏడ్చేవాడిని. 


నా బెడ్‌ పక్కనే స్నేహితుడు 

మేడ్చల్‌కు చెందిన స్నేహితుడు శ్రీనివాస్‌ కరోనా సోకి నేనున్న ఆస్పత్రిలోనే నా బెడ్‌ పక్కనే వచ్చి చేరారు. భార్యాపిల్లల్ని, అమ్మా నాన్నల్ని తలుచుకుని ఏడుస్తున్న సమయంలో నాకు ధైర్యం చెప్పి ఓదార్చేవాడు. శ్రీనివాస్‌ ఇచ్చే ధైర్యం నాలో భయాన్ని చంపేసింది. బతకాలనే ఆకాంక్షను పెంచింది. ఆస్పత్రిలో ఉన్నన్నాళ్లు వైద్యం తీసుకుంటూనే కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాం.

రూ.లక్షల్లో ఖర్చు 

నాకు  కరోనా వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న మందులు కొన్ని లేవు. కరోనాపై పూర్తి అవగాహన ఎవరికీ లేదు. వైద్యం కోసం లక్షల్లో ఖర్చు అయ్యింది. దేవుడి మీద భారమేసి అప్పోసప్పో చేసి డబ్బులు సర్దుబాటు చేసుకుంటూ చికిత్స పొందాను. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాను.


15 రోజులు సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో

కరోనాతో పోరాడి ఎలాగైనా బతకాలనే కసి పెరిగింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక ఆఫీసు గదిలో సెల్ఫ్‌  ఐసొలేషన్‌లో ఉన్నాను. యోగా, వ్యాయామం, నచ్చిన బుక్స్‌ చదువుతూ మా ఆవిడ వండి అందించే పౌష్టికాహారం తినేవాడిని. 15 రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేసి ఆరోగ్యంగా బయట పడ్డా. 


నాలో ధైర్యం నింపారు

ఆస్పత్రిలో ఉన్న సమయంలో మా ఆవిడ స్వరూపారెడ్డి, చిన్న కుమార్తె మౌనికారెడ్డి కావలసిన డబ్బులు, మందులు సర్ధుబాటు చేస్తూ నాకు ధైర్యా న్ని నూరి పోశారు. స్నేహితులు తరచూ ఫోన్లు చేసి యోగ క్షేమాలు తె లుసుకునేవారు. చావు అంచుల వరకు వెళ్ళిన నేను ప్రాణాలతో బయటపడేందుకు కారకులైన భార్య,  కుమార్తె, స్నేహితులకు ఎప్పుడూ రుణపడి ఉంటా.


ఆందోళన వద్దు... అదే మంచి మందు...

కరోనా సోకితే బతకనేమోనని ఆందోళనకు గురి కావద్దు. వైర్‌సను జయించాలంటే ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. అందరికీ చేతులెత్తి మొక్కి చెప్పేది ఒక్కటే. మనల్ని మనం కాపాడుకుంటూ కుటుంబ సభ్యులను కాపాడుకోవాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఐసొలేషన్‌లో ఉంటూ మందులు వాడితే మహమ్మారి నుంచి బయటపడొచ్చు.

Advertisement
Advertisement