వరద ముంపు... వ్యాధుల ముప్పు...

ABN , First Publish Date - 2020-10-25T11:59:56+05:30 IST

వరద ముంపు ముప్పు తగ్గినా కాలనీలు, బస్తీల్లో వ్యాధులు ముసురుకునే ప్రమాదముంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో మట్టి కుప్పలు, కొట్టుకువచ్చిన ఇతర వ్యర్థాల కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు నిలవడంతో దోమల...

వరద ముంపు... వ్యాధుల ముప్పు...

హైదరాబాద్‌ : వరద ముంపు ముప్పు తగ్గినా కాలనీలు, బస్తీల్లో వ్యాధులు ముసురుకునే ప్రమాదముంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో మట్టి కుప్పలు, కొట్టుకువచ్చిన ఇతర వ్యర్థాల కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు నిలవడంతో దోమల ఉధృతి పెరిగింది. వ్యర్థాల తొలగింపునకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామని జీహెచ్‌ఎంసీ చెబుతోన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో అంత వేగంగా చర్యలు కనిపించడం లేదు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎక్కువ వరద నీరు నిలిచి ఉన్న 156 ప్రాంతా లను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ఆ ఏరియాల్లో దోమల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే దాదాపు రెండు, మూడు రెట్ల ప్రాంతాల్లో దోమలు విజృంభణ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌ నిర్వహించేందుకు 125 బృందాలను ఏర్పాటు చేశారు.


వీటితోపాటు కేంద్ర, సర్కిల్‌ కార్యాలయాల్లో అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచారు. దోమలను చంపేందుకు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావకం పిచికారి చేయాలని నిర్ణయుంచారు. 30 వేల లీటర్ల ద్రావకం, 2 లక్షల ఆయిల్‌ బాల్స్‌ అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. కాలనీలు, బస్తీల్లో స్ర్పే చేస్తున్నామన్నారు. 2500 ఆయిల్‌ బాల్స్‌ వేశామని, అన్ని ఓపెన్‌ ప్లాట్స్‌లో టెంపోస్‌ స్ర్పే చేశామని అధికారులు తెలిపారు. 1,400 మందిని యాంటీ లార్వల్‌, 350 మందిని ఫాగింగ్‌ ఆపరేషన్‌ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సర్వీస్‌ ట్యాంకర్లతో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావకం పిచికారి చేస్తున్నామని కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల తీవ్రత ఎక్కువగా ఉంటే, జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకువస్తే యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌, ఫాగింగ్‌ వంటివి చేపడతామన్నారు.

Updated Date - 2020-10-25T11:59:56+05:30 IST