మేమేం పాపం చేశాం.. మమ్మల్ని ఎందుకు ఆదుకోరు..?

ABN , First Publish Date - 2020-10-28T12:58:19+05:30 IST

వారంతా నిరుపేదలు. కాగితాలు ఏరుకోవడం, ఇళ్లలో పనిచేయడం, లేదంటే ఇతర చిన్నాచితక ఉద్యోగాలతో జీవితాలను లాక్కురావడం.. ఇదే వారికి తెలిసింది. ఇంటి ముందు పెద్ద ఎత్తున మురుగు నీరు నిల్వ ఉన్నా, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని అమాయకమైన జీవితం మాన్గార్‌ బస్తీ

మేమేం పాపం చేశాం.. మమ్మల్ని ఎందుకు ఆదుకోరు..?

హైదరాబాద్ : వారంతా నిరుపేదలు. కాగితాలు ఏరుకోవడం, ఇళ్లలో పనిచేయడం, లేదంటే ఇతర చిన్నాచితక ఉద్యోగాలతో జీవితాలను లాక్కురావడం.. ఇదే వారికి తెలిసింది. ఇంటి ముందు పెద్ద ఎత్తున మురుగు నీరు నిల్వ ఉన్నా, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని అమాయకమైన జీవితం మాన్గార్‌ బస్తీ ప్రజలది. అలాంటి వారి కోసం దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వం రెండు, మూడు అంతస్తుల్లో భవనాలను నిర్మించి మాన్గార్‌ బస్తీ, అఫ్జల్‌ సాగర్‌ ప్రాంతాల ప్రజలకు అప్పగించింది. నాసిరకం పనులు చేయడంతో నిర్మించిన నాలుగైదేళ్లకే భవనం పై పెచ్చులు ఊడిపోవడం, రెయిలింగ్‌ కూలిపోవ డం, భవనాల మెట్లు కూలడం ఇలా అనేక సమస్యలు తలెత్తాయి. అయినా, అదే గదుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.


ఇటీవల కురిసిన భారీ వర్షానికి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఇళ్లలోకి మురుగు నీరు చేరగా, మొదటి, రెండు, మూడో అంతస్తులోని ఇళ్లలోకి స్లాబ్‌ లీకేజీతో కురవడం వల్ల నీరు చేరాయి. దాదాపు నాలుగు రోజులపాటు నిద్రాహారాలుమాని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించారు. ప్రభుత్వం వర్షం కారణంగా ఇబ్బందులు పడిన వారికి రూ. 10 వేలు, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 50 వేలు, నిరాశ్రయులైన వారికి రూ. లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసింది.  అయినా అధికారులు మాంగార్‌ బస్తీలోని ప్రజలను పట్టించుకోక పోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే వారికి మాత్రమే రూ. 10 వేల చొప్పున పరిహారం అందించారు. మొదటి, రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న వారిని కనీసం పలకరించ లేదు. దీంతో ఒక వైపు ఇళ్లలో పెచ్చులూడి గాయాలపాలై, ప్రాణాలను కాపాడుకునేందుకు రాత్రంతా జాగారం చేసిన వారికి అధికారులు సహకారం అందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తుస్తున్నారు.


తరచూ ఘటనలు...

ఆరు నెలల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో  ముగ్గురు పిల్లలు ప్రాణాల పోగొట్టుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ముగురు పిల్లలను ఇంట్లో పడుకోబెట్టి బయట మాట్లాడుతుండగా గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. దీంతో పాటు మాన్గార్‌ బస్తీలోని భవనాల రెయిలింగ్‌, మెట్లు కూలడంతో ప్రజలు ఆస్పత్రి పాలైన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. వీరందరు తమకు డబుల్‌ బెడ్రూంలు కేటాయించాలని పలు మార్లు అధికారులకు విన్నవించుకున్నా, నేటికీ ఫలితం లేకపోయింది. దాదాపు 500 కుటుంబాల వరకు ప్రమాదకరంగా ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్నాయి. ఏ ఒక్క భవనం కూలినా భారీ ప్రాణ నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల ప్రాణాలను బలితీసుకున్నవారవుతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-28T12:58:19+05:30 IST