సీతాఫల్‌మండి బాలిక ‘స్మార్ట్‌’ ప్రాజెక్ట్‌

ABN , First Publish Date - 2021-02-06T14:15:22+05:30 IST

ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఇన్‌స్పైర్‌ అవార్డు ప్రదర్శనలో

సీతాఫల్‌మండి బాలిక ‘స్మార్ట్‌’ ప్రాజెక్ట్‌

హైదరాబాద్/బౌద్ధనగర్ : ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఇన్‌స్పైర్‌ అవార్డు ప్రదర్శనలో స్మార్ట్‌గ్లౌజు ప్రాజెక్ట్‌ను తయారు చేసిన సీతాఫల్‌మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన బాలిక జాతీయ స్థాయికి ఎంపికైంది. 9వ తరగతి చదివే సఫీయాబేగం స్మార్ట్‌గ్లౌజులను తయారు చేసింది. డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవటమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. సెన్సార్‌తో కూడిన గ్లౌజులు తొడుక్కుని వాహనాలు నడిపితే.. డ్రైవర్‌ ఆరోగ్యం, గుండె పనితీరు, బీపీ, శరీర టెంపరేచర్‌ డ్రైవర్‌ ముందున్న స్ర్కీన్‌పై కనిపిస్తుంది.


ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తితే వాహనాన్ని రోడ్డుపక్క నిలిపి తక్షణమే ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఈ స్మార్ట్‌గ్లౌజుల ద్వారా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జనవరిలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఇన్‌స్పైర్‌ అవార్డు ప్రదర్శనలో సఫీయాబేగం తయారుచేసిన ప్రాజెక్ట్‌ను అప్‌లోడ్‌ చేసింది. జిల్లాకు చెందిన 12 ప్రాజెక్ట్‌లను పరిశీలించిన అధికారులు స్మార్ట్‌గ్లౌజు ప్రాజెక్ట్‌ను జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. సఫీయాబేగాన్ని ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తితో పాటు గైడ్‌ టీచర్‌ పద్మజ, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2021-02-06T14:15:22+05:30 IST