హైదరాబాద్‌లో 19 ఏళ్ల ఈ రచన.. జొమాటో డెలివరీ గర్ల్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2021-06-24T22:43:08+05:30 IST

కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ 19 ఏళ్ల యువతి చాటి చెప్పింది.

హైదరాబాద్‌లో 19 ఏళ్ల ఈ రచన.. జొమాటో డెలివరీ గర్ల్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందంటే..

కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ 19 ఏళ్ల యువతి చాటి చెప్పింది. పురుషులకు దీటుగా పనిచేసి సత్తా చాటగలనని నిరూపించింది. స్వయంగా సంపాదించుకుంటూ చదువుకుంటోంది. అంతేకాదు ఇంట్లో వాళ్లను కూడా పోషిస్తోంది. ఎక్కువగా పురుషులే పనిచేసే ఫుడ్ డెలివరి యాప్ జోమాటోలో పనిచేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. 


సాధారణంగా జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా ఎక్కువగా పురుషులే పనిచేస్తుంటారు. అయితే వరంగల్‌ జిల్లాకు చెందిన రచన పురుషులకు దీటుగా ఆ సంస్థలో పనిచేస్తోంది. రచన హోటల్ మేనేజ్‌మెంట్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చింది. పేద కుటుంబానికి చెందిన రచన చదువు కోసం హైదరాబాద్‌ వచ్చి స్వయంగా సంపాదించుకుంటోంది. కొన్ని రోజుల పాల బూత్‌లో పనిచేసింది. ఉదయం నాలుగు గంటలకే లేచి పాల బూతులో పని చేసి.. తర్వాత కాలేజికి వెళ్లి చదువుకునేది. జీతంలో తన గది కిరాయి, చేతి ఖర్చులకు డబ్బులు ఉంచుకుని మిగిలిన వాటిని ఇంటికి పంపేది. 


లాక్‌డౌన్ కారణంగా ఆమె ఉద్యోగం పోయింది. అయినా నిరాశ పడకుండా కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు అప్లై చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. అయితే బైక్ లేకపోవడంతో ఆమెకు మరో చిక్కువచ్చి పడింది. దగ్గర ఆర్డర్లకు నడిచి వెళ్లి డెలివరీ చేసేది. దూరం అయితే ఇంటి ఓనర్ బైక్‌ను వాడుకునేది. ఆమె కథ మీడియా ద్వారా బయటకు రావడంతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఎంతో మంది పేద విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. 

Updated Date - 2021-06-24T22:43:08+05:30 IST