హయత్‌నగర్‌ డివిజన్‌లో వీడీసీసీ రోడ్లు నాసిరకం

ABN , First Publish Date - 2021-06-23T18:08:29+05:30 IST

హయత్‌నగర్‌ డివిజన్‌లో వేసిన వీడీసీసీ రోడ్లు మూన్నాళ్లకే ధ్వంసం అవుతున్నాయి. గత సంవత్సరం డివిజన్‌లోని వివిధ కాలనీల్లో

హయత్‌నగర్‌ డివిజన్‌లో వీడీసీసీ రోడ్లు నాసిరకం

అధికారులు పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం వృథా 

సంవత్సరంలోపే రోడ్లపై పగుళ్లు


హైదరాబాద్/హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ డివిజన్‌లో వేసిన వీడీసీసీ రోడ్లు మూన్నాళ్లకే ధ్వంసం అవుతున్నాయి. గత సంవత్సరం డివిజన్‌లోని వివిధ కాలనీల్లో  రూ. కోట్లతో వీడీసీసీ రోడ్లు వేశారు. కాంట్రాక్టర్లు అడ్డగోలుగా రోడ్ల నిర్మాణం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయా కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలు ఉండాల్సిన సీసీ రోడ్లు సంవత్సరంలోపే ధ్వంసం అయ్యాయి. 

 డివిజన్‌లో వీడీసీసీ రోడ్లు పగులు వారాయి. రోడ్ల పనుల చేపడుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్‌లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి తూతూ మంత్రంగా రోడ్లు నిర్మిస్తున్నారు. అందుకు హయత్‌నగర్‌లోని రేడియో స్టేషన్‌ సమీపంలో ఉన్న సూర్యానగర్‌లో కాలనీలో గత సంవత్సరం రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లు నిదర్శనం. కాలనీ వాసులు ఎంతో కష్టపడి నేతల చుట్టూ తిరిగి వేయించుకున్న రోడ్లు  మూణ్నాళ్లకే బీటలు పారి ధ్వంసం అవుతున్నాయి. ఇసుకకు బదులు రాతి పౌడర్‌, సరైన మోతాదులో నీరు పెట్టకపోవడం కారణంగా రోడ్లు ఏడాదికే పగుళ్లు బారాయని స్థానికులు అంటున్నారు. రోడ్డుకు సైడ్‌ బరం నింపకకుండా నిర్లక్ష్యంగా వదిలి వేస్తున్నారు. వేసిన రోడ్డుకు కనీసం 15 రోజులు పాటు వాటర్‌ క్యూరింగ్‌ చేయకుండా గాలికి వదిలి వేస్తున్నారు. కాంట్రాక్టరుకు లాభం చేకురేలా కొంతమంది జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతి నిధులు చెబుతున్నారు.  రోడ్ల పగుళ్ల గురించి ఇంజనీరింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.  


కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

హయత్‌నగర్‌ డివిజన్‌లోని సూర్యనగర్‌ కాలనీ ఫేస్‌- 1, 2లలో వీడీసీసీ రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. దాదాపు రూ. కోటితో నిర్మించిన సీసీ రోడ్ల మధ్యలో పగుళ్లు ఏర్పడాయి. నాణ్యత లేని కారణంగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. కాంట్రాక్టర్‌కు జరిమానా విధించి బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న  ఇంజనీర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌పైనా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.

- వెంకటేశంగౌడ్‌, అధ్యక్షుడు, సూర్యానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం ఫేస్‌- 1

Updated Date - 2021-06-23T18:08:29+05:30 IST