Abn logo
Sep 26 2021 @ 02:10AM

హైదరాబాద్‌లో కుండపోత!

రహదారులపై పోటెత్తిన వరద.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపైకి నీళ్లు.. మణికొండలో 10.5 సెం.మీ.

4 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌ సిటీ, రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల పాటు నగర వ్యాప్తంగా దంచికొట్టిన వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. పలు కాలనీల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు మోస్తరుగా ప్రారంభమైన వర్షం క్రమేపీ భారీగా మారింది. రెండు గంటల పాటు కుండపోతగా కురిసింది. ప్రధాన రహదారులకు వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమాలో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుండడంతో ముందు జాగత్తగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.


జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు, టోలీచౌకీ నుంచి రాయదుర్గం వరకు, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, ట్యాంక్‌బండ్‌ నుంచి సికింద్రాబాద్‌ మార్గంలో అరగంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. నగరంలోని సెక్రటేరియట్‌ కాలనీలోని పందెన్‌వాగులో వర్షపు నీటి ప్రవాహ ఉధృతికి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి పట్టుతప్పి నీటితో నిండిన పైపులైన్‌ గోతిలో పడిపోగా, ప్రవాహ ఉధృతికి వాగులోకి కొట్టుకుపోయాడు.  రాత్రి 9.30 గంటల వరకు అత్యధికంగా మణికొండలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే షేక్‌పేట్‌లో 6.4, నాచారంలో 6.0 సెంటీమీటర్లు నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు సాయం కోసం 040-29555500 నంబర్‌లో సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టు గ్రామమైన దుపార్‌పేట్‌ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా.. గులాబ్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన రైలును రద్దు చేశామని, హైదరాబాద్‌-హౌరా రైలును కొంత ఆలస్యంగా నడుపుతామని రైల్వే శాఖ తెలిపింది.

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో తుపాన్‌గా మారి న వాయుగుండం, మరో 24 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ఖమ్మం, మహబుబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాన్‌ (గులాబ్‌) ఆదివారం సాయంత్రం కళింగపట్నం- గోపాల్‌పూర్‌ (ఒడిసా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఒడిసా, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు, సోమవారం ఈశాన్య, తూర్పు బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దాని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 24 గంటల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.