HYD : రాజస్థాన్‌లో చోరీ.. నగరంలో మకాం.. పోలీసులకు పట్టుబడటంతో ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-09T17:38:51+05:30 IST

రాజస్థాన్‌లో ఓ రిటైర్డ్‌ తహసీల్దార్‌ అకౌంట్‌లోని రూ. 9 లక్షలను కాజేసి...

HYD : రాజస్థాన్‌లో చోరీ.. నగరంలో మకాం.. పోలీసులకు పట్టుబడటంతో ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : రాజస్థాన్‌లో ఓ రిటైర్డ్‌ తహసీల్దార్‌ అకౌంట్‌లోని రూ. 9 లక్షలను కాజేసి, నగరంలో మకాం పెట్టిన నిందితుడు రాజస్థాన్‌ పోలీసులు చిక్కాడు. మరుసటి రోజు నిందితుడిని అక్కడకు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతుండగా శవమై కనిపించాడు. దీంతో రాజస్థాన్‌ పోలీసులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన రమేష్‌ రెడ్డి (40) 20 సంవత్సరాల క్రితం రాజస్థాన్‌కు వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. రిటైర్డ్‌ తహసీల్దార్‌ ప్రహలాద్‌ సింగ్‌ ఇంట్లో గదిని అద్దెకు తీసుకొని రెండు దశాబ్దాలుగా వారితో సొంత మనిషిగా మెలుగుతూ వచ్చాడు.


ప్రహలాద్‌ సింగ్‌ కుటుంబం మొత్తం రమేష్‌ రెడ్డిని పూర్తిగా నమ్మి తమ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలతో పాటు అన్ని విషయాలనూ చెప్పింది. వారిని నమ్మించి రమేష్‌ రెడ్డి గత సంవత్సరం నవంబర్‌లో ప్రహలాద్‌ సింగ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ. 9 లక్షలు తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. హైదరాబాద్‌ నగరానికి పారిపోయి వచ్చాడు. అదే నెలలో రాజస్థాన్‌ జైపూర్‌ జిల్లాలోని వైశాలి పోలీస్‌ స్టేషన్‌లో రమేష్‌ రెడ్డిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌ పోలీసులు అప్పటి నుంచీ అతడి కోసం గాలిస్తున్నారు. రమేష్‌ రెడ్డి నగరంలోని మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన రాజస్థాన్‌ పోలీసులు ఈ నెల 7న మీర్‌పేట్‌కు చేరుకొని రమేష్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.


అనాథ అయిన తాను నగరంలో అనాథాశ్రమం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజస్థాన్‌ పోలీసులకు చెప్పాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం విమానంలో రమేష్‌ రెడ్డిని తీసుకుని వెళ్దామని, అప్పటి వరకు నాంపల్లిలోని యూసుఫియాన్‌ దర్గా ఎదురుగా ఉన్న లాడ్జ్‌లో నిందితుడితో కలిసి పోలీసులు బస చేశారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచిన రాజస్థాన్‌కు చెందిన ఏఎ్‌సఐ దీప్‌ సింగ్‌ వాష్‌ రూంకు వెళ్లి వచ్చాడు. తాను కూడా వాష్‌ రూంకి వెళ్లాలని చెప్పి రమేష్‌ రెడ్డి లాడ్జిలోని బాత్‌రూంలోకి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా నైట్‌ ప్యాంట్‌తో షవర్‌ రాడ్‌కు ఉరేసుకుని నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. వెంటనే రాజస్థాన్‌ పోలీసులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా తెలిపారు.

Updated Date - 2021-10-09T17:38:51+05:30 IST