హైదరాబాద్‌ మెట్రోకు మళ్లీ కష్టాలు...

ABN , First Publish Date - 2021-05-03T17:32:10+05:30 IST

హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ప్రయాణికులను పెంచుకునేందుకు ఆపసోపాలు

హైదరాబాద్‌ మెట్రోకు మళ్లీ కష్టాలు...

హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ కారణంగా మెట్రో రైలు ప్రయాణానికి నగరవాసులు వెనుకంజ వేస్తున్నారు. అత్యధికులు సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ప్రయాణికులను పెంచుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. కొవిడ్‌కు ముందు రోజూ దాదాపు 3.50 లక్షల నుంచి 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం సెప్టెంబర్‌ నుంచి మెట్రోరైళ్లు పట్టాలపైకి వచ్చినప్పటికీ ప్రయాణికుల సంఖ్య పెరగలేదు. దీంతో అధికారులు నవంబర్‌ నుంచి జనవరి 14 వరకు సువర్ణ డిస్కౌంట్‌ ఆఫర్‌ను అందుబాటులో ఉంచి ప్యాసింజర్లను పెంచుకునేందుకు కృషి చేశారు. అన్‌లాక్‌ తర్వాత రోజుకు సగటున 1.40 లక్షల మంది ప్రయాణించగా, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 10 వరకు రోజుకు 1.60 లక్షల 1.90 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు తెలిసింది.


వేసవి నేపథ్యంలో...

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వేసవితాపం కారణంగా ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా చాలామంది మెట్రోను ఆశ్రయుంచారు. దీంతో ప్రయాణికుల సంఖ్య 1.80 లక్షల నుంచి 1.90 లక్షల వరకు చేరింది. ఏప్రిల్‌ 3న నగరంలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ రోజు 2.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. మళ్లీ పూర్వ వైభవం వస్తుందని సంతోషించే లోపు కొవిడ్‌ రెండో దశ దాడితో మెట్రో మళ్లీ కుదేలైంది. ప్రస్తుతం మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 1.35 లక్షల నుంచి 1.50 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్లు మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 386 కోట్ల ఆదాయం రాగా, నిర్వహణ ఖర్చు రూ.2152 కోట్లు అయిందని, మరోవైపు మాల్స్‌కు కూడా ఆదరణ లేకపోవడంతో నష్టాలు పెరిగిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-03T17:32:10+05:30 IST