HYD : Metro దసరా బంపరాఫర్‌.. 20 ట్రిప్పులకు చెల్లిస్తే..

ABN , First Publish Date - 2021-10-15T12:46:47+05:30 IST

ప్రయాణికులకు దసరా పండుగ సందర్భంగా మెట్రో సువర్ణ ఆఫర్‌ - 2021ను

HYD : Metro దసరా బంపరాఫర్‌.. 20 ట్రిప్పులకు చెల్లిస్తే..

  • 30 ట్రిప్పుల ప్రయాణం
  • ఎంజీబీఎస్-జేబీఎస్‌ మార్గంలో ప్రతీ ట్రిప్‌‌కు రూ.15 మాత్రమే
  • నెలకో సారి లక్కీ డ్రా కూడా..

హైదరాబాద్‌  సిటీ : ప్రయాణికులకు దసరా పండుగ సందర్భంగా మెట్రో సువర్ణ ఆఫర్‌ - 2021ను ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌) గురువారం ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ట్రిప్‌ పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి నెలవారీగా పాస్‌గా ఇది ఉపయోగపడనుంది. అదేవిధంగా గ్రీన్‌లైన్‌పై (ఎంజీబీఎ్‌స-జేబీఎస్‌) ప్రయాణించే వారికి ప్రత్యేక ఆఫర్‌ ఇస్తోంది. మెట్రోలో వివిధ కార్డులపై ప్రయాణించేవారికి ప్రతీ నెలా లక్కీడ్రా నిర్వహించనున్నారు. ఈ సువర్ణ ఆఫర్‌ ఈ నెల 18 నుంచి జనవరి 15 వరకు ఉంటుందని అధికారులు ప్రకటించారు.


ట్రిప్‌ పాస్‌ ఇలా..!

మెట్రోలో నిత్యం ప్రయాణించే వారు 20 ట్రిప్పుల (ఒకసారి ప్రయాణం) ధర చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించొచ్చు. ఆ ట్రిప్పులను 45 రోజులలోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ కేవలం మెట్రో స్మార్డ్‌ కార్డుపై మాత్రమే వర్తిస్తుంది. ట్రిప్‌ పాస్‌ను ఈ నెల 18 నుంచి మెట్రో స్టేషన్లలో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌కు టికెట్‌ ధర రూ.35 ఉండగా, గ్రీన్‌లైన్‌ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.15తో ప్రయాణం చేయవచ్చు. గ్రీన్‌లైన్‌ మార్గంలో జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ హాస్పిటల్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ వరకు 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. రూ.15తో ఏ స్టేషన్‌ నుంచి ఏ స్టేషన్‌కైనా ప్రయాణించవచ్చు. నెలలో కనీసం 20 సార్లు మెట్రోలో ప్రయాణించిన వారు తమ సీఎస్‌సీ (కాంటాక్ట్‌ లెస్‌ స్మార్ట్‌కార్డు)లను మెట్రో స్టేషన్‌ల వద్ద నమోదు చేసుకుంటే లక్కీడ్రాలో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2021-10-15T12:46:47+05:30 IST