హైదరాబాద్ మెట్రోలో భారీగా తగ్గిన ప్రయాణికులు

ABN , First Publish Date - 2021-05-16T16:00:50+05:30 IST

ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే...

హైదరాబాద్ మెట్రోలో భారీగా తగ్గిన ప్రయాణికులు

హైదరాబాద్‌ సిటీ : జంట నగరాల పరిధిలో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో రైలు నిరాదరణకు గురవుతోంది. నిన్న, మొన్నటివరకు మెట్రో రైలు జర్నీకే మొగ్గుచూపిన నగరవాసులు కొవిడ్‌ రెండో దశ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పూర్తిగా వెనక్కి తగ్గారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలు అందుబాటులో ఉండడంతో రైళ్లను ఎక్కేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో నగరంలో మెట్రో రైడర్‌షిప్‌ భారీగా తగ్గిందని చెప్పవచ్చు. కరోనా కేసుల తీవ్రత కారణంగా ఈనెల 12 నుంచి 22 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు మెట్రో కార్యకలాపాలు ఉదయం 7 నుంచి 9.45 గంటల వరకే పూర్తి చేసేందుకు నిర్ణయించారు.


2020 మార్చి 16 కొవిడ్‌కు ముందు నగరంలో ప్రతి రోజూ 3.80లక్షల నుంచి 4 లక్షల మంది వరకు మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు. అనంతరం లాక్‌డౌన్‌ రావడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్‌ 27 నుంచి మెట్రో ప్రారంభమైనప్పటికీ ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి పడిపోయింది. రోజుకు సగటున 1.60 లక్షల నుంచి 1.80 లక్షల మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు క్రమక్రమంగా కోలుకుంటున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థను లాక్‌డౌన్‌ పూర్తిగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన తర్వాత రెండు రోజుల వరకు 4 నుంచి 6వేల మంది మాత్రమే ప్రయాణించారు. శనివారం ఆ సంఖ్య 12వేలకు చేరినట్లు మెట్రో వర్గాలు వెల్లడించాయి. కేవలం 2.45 గంటల సమయం ఉండడంతోపాటు కొవిడ్‌ భయంతో నగరవాసులు రైళ్లు ఎక్కేందుకు రావడం లేదని, కరోనాతో వరుసగా రెండో ఏడాదీ నష్టాలే ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-16T16:00:50+05:30 IST