Abn logo
Apr 11 2021 @ 11:57AM

హైదరాబాద్‌లో అంతు చిక్కని మిస్సింగ్ కేసులు...

  • వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు
  • వేర్వేరుగా మరో ఐదుగురు

హైదరాబాద్/వనస్థలిపురం/నార్సింగ్‌/నేరేడ్‌మెట్‌/ ఆనంద్‌బాగ్ : గ్రేటర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ఎనిమిది మంది అదృశ్యమయ్యారు. అందులో ముగ్గురు బాలికలు ఉన్నారు. నార్సింగ్‌ పరిధిలో ఇద్దరు, నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో ఇద్దరు, మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువకుడు కనిపించకుండా  పోయారు. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఇంజాపూర్‌లో మహ్మద్‌ మిర్జాన్‌ అన్వర్‌, నస్రీన్‌లకు ముగ్గురు కుమార్తెలు మిర్జాన్‌ ఆయేషా(17), మిర్జాన్‌ ఆస్మా బేగ్‌(15), మిర్జాన్‌ అబేజ్‌ బేగ్‌ ఉన్నారు. వీరు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. బంధువుల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా, ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా, ముగ్గురు బాలికలు అదే రోజు రాత్రి 3 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లినట్లు గుర్తించారు. కాగా, మహ్మద్‌ మిర్జాన్‌ అన్వర్‌ స్థానికంగా ఉండే రమేష్‌ అనే యువకుడిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు. తన పెద్ద కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

  • నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మీర్జాగూడ ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన కోటా రాజేశ్‌గౌడ్‌ (22) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 4 నుంచి కనిపించకుండా పోయాడు. సోదరుడు కోటా శంకర్‌గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

  • మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధి ఆర్‌కేనగర్‌ నివాసి కేపీ అరవింద్‌(26) నాలుగేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వివాహం విషయంలో సంప్రదించగా ఆమె కుటుంబం అంగీకరించలేదు. ఈ నెల 10న ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచిన తండ్రి ప్రేమ్‌నాథ్‌కు అరవింద్‌ కనిపించలేదు. సీసీ పుటేజీలు పరిశీలించగా, అర్ధరాత్రి లగేజీతో వెళ్లినట్లు కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
  • నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధి శ్రీ సాయినగర్‌లో ఉండే ఎం.మధు  (20) ఈ నెల 7నుంచి కనిపించడం లేదు. తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ నరసింహస్వామి తెలిపారు.

  • తిరుమలగిరి కానాజీగూడలో ఉండే ఎస్‌.పుష్పామాల(65) నర్సు గా రిటైర్డ్‌ అయ్యారు. ఈ నెల 2న భర్తతో గొడవపడి నేరేడ్‌మెట్‌ ఆర్కే పురంలోని సోదరికి ఇంటికి వెళ్లారు. ఈ నెల 4న తాను పని చేసిన ఆస్పత్రికి వెళ్లి, తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహస్వామి తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement