హైదరాబాద్‌లో ఈ మిస్టరీ మిస్సింగ్స్‌.. ముడి వీడేదెన్నడో..!

ABN , First Publish Date - 2021-06-28T13:30:20+05:30 IST

గారాబంగా పెంచుకున్న కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. పని ఉందంటూ బయటకు వెళ్లిన కుమారుడు

హైదరాబాద్‌లో ఈ మిస్టరీ మిస్సింగ్స్‌.. ముడి వీడేదెన్నడో..!

  • సైదాబాద్‌ ఠాణాలో పెరుగుతున్న కేసులు
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 42 మంది మాయం

గారాబంగా పెంచుకున్న కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. పని ఉందంటూ బయటకు వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదు. ఓ వివాహిత కనిపించకుండా పోయింది. కుటుంబభారం మోయాల్సిన పెద్దాయన ఎక్కడికో వెళ్లిపోయాడు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తరచూ ఇలాంటి సంఘటనలు  చోటు చేసుకుంటున్నాయి. నెలకు సగటున 5 నుంచి 8 వరకు మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీరి ఆచూకీని కనుగొనడం పోలీసులకు తలనొప్పిగా మారతోంది.


హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : ప్రేమ వివాహాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, కారణాలు ఏవైనా పలువురు కనిపించకుండా పోతున్నారు. ఏటికేడు అదృశ్య కేసుల నమోదు పెరుగుతోంది. ఇలాంటి కేసులలో చాలామందిని పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చుతున్నా, మరికొందరి ఆచూకీ వెతికి పట్టుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబసభ్యులు తమవారి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 42 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో  బాలికలు తొమ్మిది మంది ఉండగా, ఏడుగురిని పోలీసులు గుర్తించి.. వారి కుటుం బ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఇద్దరు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. దీంతో కిడ్నాప్‌ కేసులు నమోదు చేశారు. యువతులు, మహిళలు 23 మంది కనిపించకుండా పోగా, 18 మం దిని గుర్తించారు. 10 మంది పురుషులు మిస్సింగ్‌ కేసులు నమోదు, కాగా 9 మం దిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


చిన్నారుల నుంచి వృద్ధుల వరకు..

ఆడ, మగ వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అదృశ్యమవుతున్నారు.  ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై బాలికలు, యువతులు ఇల్లు విడిచి పోతున్నట్లు కొన్ని సందర్భాల్లో తేలుతోంది. వ్యసనాలకు బానిసలైన వారు కుటుంబపోషణ, అప్పులు భరించలేక ఎవరికీ చెప్పకుండా మాయమవుతున్నారు. 


కుటుంబ సమస్యలే కారణమా?

భార్యాభర్తల మధ్య విభేదాలు వారి మధ్య ఆగాధాన్ని సృష్టిస్తున్నాయి. కుటుంబ కలహాలు వారి మధ్య దూరాన్ని పెంచుతూ, మాటామాటా పెరిగి వారు ఇంటిని వీడుతున్నారు. అదృశ్యమైన వారికోసం కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 


మానసిక, ఆర్థిక సమస్యలు

మానసిక వేదనతో ఎవరికీ చెప్పకుండా కొందరు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మరి కొంత మంది అప్పుల బాధ, మానసిక ఆందోళన తదితర కారణాలతో ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు. సైదాబాద్‌ పీఎస్‌ పరిధిలో 70, 80 ఏళ్ల వృద్ధులు సైతం ఇంటి నుంచి వెళ్లిపోయారు. చివరకు పోలీసులు అతికష్టంగా వారి అచూకీ కనుగొని కుటుంబసభ్యులకు అప్పగించారు.


ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం

ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి అదృశ్యమైన వ్యక్తులను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నాం. జనవరి నుంచి పీఎస్‌ పరిధిలో 42 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా, 34 కేసులు చేధించాం. మిగతా వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఈ కేసులలో అధిక శాతం ప్రేమ వివాహాలు కారణంగానే బాలికలు, యువతులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిసారించాలి. - కస్తూరి శ్రీనివాస్‌, ఎస్‌హెచ్‌ఓ, సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌


తల్లిదండ్రులు అంగీకరించలేదని..

ప్రేమ వివాహాలకు పెద్దల నుంచి ఆమోదం లభించదన్న భయంతో కొందరు యువతీయువకులు ఇంటి నుంచి  పారిపోతున్నారు. ప్రేమ వివాహాలు ఆంగీకరించని తల్లిదండ్రులు కిడ్నాప్‌, మిస్సింగ్‌ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా నాలుగు నెలలో 9 మంది మైనర్‌ బాలికలు ఆదృశ్యం కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2021-06-28T13:30:20+05:30 IST