Abn logo
Sep 28 2021 @ 11:15AM

అటెన్షన్..

గులాబ్‌ తుఫాన్‌తో అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్‌ అయింది. ప్రజలకు తగిన సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తోంది. ముంపు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. అవసరమైతే.. ఆయా శాఖలు పేర్కొంటున్న అత్యవసర నెంబర్లలో సంప్రదించాలి. రోడ్లపై ప్రయాణాలు, బయటకు వెళ్లినప్పుడు వర్షం నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో ఆచితూచి ముందుకెళ్లడం మేలు. ఇప్పటికే సోమవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నిలిచిన వరద నీటితో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. 


అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

రోడ్లపై నిలిచిన వరద

వాటర్‌ లాగింగ్‌ పాయింట్ల వద్ద అధ్వాన పరిస్థితులు

లోతట్టు ప్రాంతాలకు జలగండం

తుఫాన్‌ నేపథ్యంలో అన్ని శాఖల అదనపు ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీ నుంచి అదనంగా 20 డీఆర్‌ఎఫ్‌ బృందాలు


గండిపేట మరో రెండు గేట్లు ఓపెన్‌

హైదరాబాద్/నార్సింగ్‌: తుఫాను, వర్షాల కారణంగా గండిపేట జలాశయంలో ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. దీంతో మరో రెండు గేట్లు అదనంగా తెరిచారు. ఇప్పటికే నాలుగు రోజుల క్రితం జలమండలి రెండు గేట్లు తెరిచినట్లు జలమండలి జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌లో కూడా రెండు గేట్లు తెరిచిన విషయం తెలిసిందే. గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల పైభాగంలో ఉన్న ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గండిపేట నాలుగు గేట్లు మరో అడుగు పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌ జలాశయం మరో గేటు ఎత్తారు. 


మంచిరేవులకు రాకపోకలు బంద్‌

గండిపేట జలాశయం గేట్లు ఎత్తివేయడంతో మంచిరేవుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి గల ఏకైక కాజ్‌వే పైనుంచి రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆపివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. 


అల్వాల్‌లో లోతట్టు ప్రాంతాలు...

భారీ వర్షాలకు అల్వాల్‌లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో  నిండాయి. శ్రీబేకరీ, శ్రీనివా్‌సనగర్‌ కాలనీ, తుర్కపల్లి, తదితర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. లష్కర్‌లో కూడా జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 


మూసీలో కొట్టుకొచ్చిన యువకుడి మృతదేహం 

దిల్‌సుఖ్‌నగర్‌: చైతన్యపురిలోని మూసీనదిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. సుమారు 25 నుంచి 35 సంవత్సరాల వయస్సుగల యువకుడి మృతదేహం చైతన్యపురి ఫణిగిరి కాలనీ ప్రాంతానికి కొట్టుకు వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. నలుపురంగు చొక్కా, నలుపురంగు ప్యాంటు ధరించిన ఆ యువకుడి కుడి చేతిపై దర్శణ్‌ అనే పేరు హిందీ అక్షరాలతో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 


పొంగిన బల్కాపూర్‌ నాలా

ఆనంద్‌నగర్‌ బస్తీకి హెచ్చరికలు 

బేగంపేట: సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట, రాజ్‌భవన్‌రోడ్డు, ముఖ్యమంత్రి కార్యాలయ రహదారి, బల్కంపేట, యూసూ్‌ఫగూడలోని కృష్ణానగర్‌ రహదారిలో వర్షం నీరు నిలిచిపోయింది. ఖైరతాబాద్‌, సోమాజిగూడ, బేగంపేట పరిసరాల్లోని లోతట్టు ప్రాంతా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ బస్లీలోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. బల్కాపూర్‌ నాలా పొంగడంతో బస్తీని వరద ముంచెత్తింది. జీహెచ్‌ఎంసీ అత్యవసర విభాగం సిబ్బంది ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రమాద తీవ్రతను స్థానికులకు తెలిపారు. ఇటు వైపు రాకపోకలు చేయవద్దంటూ రహదారికి అడ్డంగా రిబ్బన్లను  కట్టారు. 

పొంగుతున్న కాముని చెరువు నాలా

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలోని కాముని చెరువు నాలా వర్షాలకు పొంగి పొర్లుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్థానికులకు తగిన సూచనలు చేశారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరారం కాలనీ, సుభా్‌సనగర్‌, చింతల్‌, కుత్బుల్లాపూర్‌, జగద్గిరిగుట్ట, గాజులరామారం, షాపూర్‌నగర్‌లలోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే నిండుకుండలా ఉన్న ఫాక్స్‌సాగర్‌, ఇతర చెరువులు వర్షాలు పెరిగితే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అడ్డంకులను తొలగిస్తున్నారు.


కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదుల వరద

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌(040 2111 1111)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం 312 ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లపై వరద నీరు నిలిచిందని, కాలనీలు, బస్తీల ఇళ్లలోకి నీరు వచ్చిందన్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. చెట్ల కొమ్మలు విరిగాయని, భవనాల గోడలు శిథిలావస్థకు చేరాయని కొందరు ఫిర్యాదు చేశారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఖ్యను పెంచింది. రెగ్యులర్‌గా ఉండే 19 బృందాలకు తోడు మరో 20 టీంలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మోటార్‌ పంప్‌, జనరేటర్‌, ఇతరత్రా పరికరాలతో కూడిన వాహనంలో 10 నుంచి 15 మంది సిబ్బందితో అదనపు బృందాలు రంగంలోకి దిగాయి. మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డిలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడంతోపాటు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.