జడ్జి చొరవతో.. Hyderabad అనాథ ఆశ్రమం నుంచి సిక్కింకు..!

ABN , First Publish Date - 2021-11-15T18:54:04+05:30 IST

మతిస్థిమితం కోల్పోయి.. ముగ్గురు పిల్లలు.. గర్భిణిగా రోడ్లపై తిరుగుతున్న...

జడ్జి చొరవతో.. Hyderabad అనాథ ఆశ్రమం నుంచి సిక్కింకు..!

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : మతిస్థిమితం కోల్పోయి.. ముగ్గురు పిల్లలు.. గర్భిణిగా రోడ్లపై తిరుగుతున్న మహిళలను చేరదీసిన అధికారులు, అనాథ ఆశ్రయంలో చేర్పించారు. వారు ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి.. ప్రసవం చేయించి.. ఆదివారం ఆమె సొంత ప్రాంతమైన సిక్కిం అధికారులకు అప్పగించారు. సిక్కింకు చెందిన భీమ్‌రాణి.. నేపాల్‌కు చెందిన వినోద్‌ను ప్రేమించి పెళ్లాడింది. బతుకుదెరువు కోసం ఈ జంట నగరానికి వచ్చి, చిన్నా చితక పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వారికి ఓ పాప, ఇద్దరు కుమారులు. మరోసారి ఆమె గర్భవతి. బాలిక అత్యాచారం కేసులో భర్త జైలుకు వెళ్లడంతో ఆమె దిక్కులేనిదైంది. మతిస్థిమితం కోల్పోయింది.


రోడ్లపై తిరుగుతుండగా, ఈ ఏడాది ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి సఖీ బృందంతో  కలసి ఆమెను కస్తూరిబా గాంధీ ఆశ్రమంలోని స్వధార్‌ గృహ శిబిరంలో చేర్చారు. అప్పటికే 8 నెలల గర్భిణి అయిన భీమ్‌రాణికి రోజూ కౌన్సెలింగ్‌ ఇచ్చి, వైద్యం అందించారు. అదేసమయంలో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. మెల్లిగా కోలుకుని వివరాలు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం సిక్కిం రాష్ట్ర అధికారులతో మాట్లాడారు. వారు నిర్ధారించడంతో ఆదివారం సిక్కిం అధికారులు నోరిత్‌ పెప్చా, అరుణా తమంగ్‌లు రాగా, వారికి భీమ్‌రాణిని.. నలుగురు పిల్లలను ఆశ్రమం ఇన్‌చార్జి పద్మావతి, రంగారెడ్డి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి సమక్షంలో అప్పగించారు. అక్కడికి వెళ్లిన తర్వాత చిన్న వ్యా పారం చేసుకునేందుకు రూ.10వేలు అందజేశారు. 


జడ్జి చొరవతో..

ఇటీవల ఆశ్రమాన్ని సందర్శించిన రంగారెడ్డి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి.. భీమ్‌రాణి గురించి తెలుసుకున్నారు. ఆమె వివరాలను సిక్కిం మహిళ కమిషన్‌కు పంపించారు. 


సిక్కిం నుంచి మంగమ్మ

సిక్కిం నుంచి అధికారులు ఒక మహిళను తీసుకువచ్చారు. రెండేళ్ల నుంచి ఆమె సిక్కింలోని గాంగ్‌ టక్‌రోడ్లపై తిరుగుతోందని, తెలుగు మాట్లాడుతున్నందున ఆమెను ఆశ్రమం వారికి అప్పగించారు. ఆమె పేరు మంగమ్మ అని ప్రకాశం జిల్లా మార్కాపురం అని చెబుతోందని ఆశ్రమ ఇన్‌చార్జి పద్మావతి తెలిపారు. ఆమెకూ మతిస్థిమితం సరిగ్గా లేదని, వైద్యం అందిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-11-15T18:54:04+05:30 IST