ఈ రేంజ్‌లో కరోనా ఉన్నా హైదరాబాద్‌లో పార్కులు మూసేయరేం!?

ABN , First Publish Date - 2021-05-10T17:46:54+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ పార్కులను మూసివేయకపోవడం...

ఈ రేంజ్‌లో కరోనా ఉన్నా హైదరాబాద్‌లో పార్కులు మూసేయరేం!?

  • పార్కుల్లో పరేషాన్‌
  • సాగర్‌ తీరాన రద్దీ 
  • ఇప్పటికే 20 మంది సిబ్బందికి కొవిడ్‌

హైదరాబాద్‌ సిటీ : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ పార్కులను మూసివేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సందర్శకుల తనిఖీ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే 20 మంది కొవిడ్‌ బారిన పడగా, ఓ సెక్యూరిటీ గార్డు మరణించారు. హుస్సేన్‌ సాగర్‌ తీరాన లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, సంజీవయ్య పార్క్‌లతోపాటు నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌ బండ్‌ ఉన్నాయి. సెలవులు, పండగ రోజుల్లో ఇవి సందర్శకులతో రద్దీగా ఉంటున్నాయి. గతేడాది లాక్‌ డౌన్‌తో మూతపడ్డ పార్కులు సుమారు ఆరు నెలల అనంతరం తెరుచుకున్నాయి. 


జాతీయ పార్కులు మూత

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశవ్యాప్తంగా జాతీయ పార్కులను మూసివేశారు. హైదరాబాద్‌ లోని నెహ్రూ జువాలజికల్‌ పార్క్‌ కూడా ఈ నెల 2 నుంచి మూతపడింది. జూ పార్క్‌లో ఉన్న సింహాలకు కరోనా సోకడంతో సందర్శకులకు అనుమతి నిలిపేశారు.


కనిపించని కట్టడి

హుస్సేన్‌ సాగర్‌ తీరాన గల పార్కులలో హౌస్‌ కీపింగ్‌ వర్కర్స్‌, ఫారెస్ట్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సుమారు 300 మందికి పైగా పని చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో సాయంత్రం సమయంలో లుంబినీ, సంజీవయ్య పార్కులు, ఎన్టీఆర్‌ గార్డెన్‌లను సందర్శకులు వస్తున్నారు. వారిని తనిఖీ చేసే సెక్యూరిటీ సిబ్బందిలో 20 మంది వరకూ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఓ సెక్యూరిటీ గార్డు కరోనాతో మరణించాడు. పార్కుల నిర్వహణ చేపట్టే హెచ్‌ఎండీఏలో కరోనా నేపథ్యంలో అధికారులు, ఉద్యోగులు ఇతర సిబ్బంది 50 శాతం మాత్రమే విధులకు హాజరవుతున్నారు. రోజు విడిచి రోజు ఆఫీసులకు వస్తున్నారు. నిత్యం వేలాది మంది సందర్శించే పార్కుల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ లేవు. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పార్కుల్లో కట్టడి చర్యలు చేపట్టాలని, కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలకు అనుగుణంగా పార్కులను మూసివేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-10T17:46:54+05:30 IST