HYD : పోలీసులు ఊహించని పరిణామం.. చిన్న పొరపాట్లతో 15 రోజుల కష్టం ఆవిరి.. ఎందుకిలా జరిగింది..!?

ABN , First Publish Date - 2021-12-02T16:41:48+05:30 IST

HYD : పోలీసులు ఊహించని పరిణామం.. చిన్న పొరపాట్లతో 15 రోజుల కష్టం ఆవిరి.. ఎందుకిలా జరిగింది..!?

HYD : పోలీసులు ఊహించని పరిణామం.. చిన్న పొరపాట్లతో 15 రోజుల కష్టం ఆవిరి.. ఎందుకిలా జరిగింది..!?

హైదరాబాద్‌ సిటీ : వారంతా సైబర్‌ నేరగాళ్లు. ఢిల్లీలో కూర్చుని దేశవ్యాప్తంగా వందల మందిని మోసం రూ. కోట్లు కొల్లగొట్టారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కూడా సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునేందుకు 23 మంది పోలీసులను ఢిల్లీకి పంపారు. సుమారు 15 రోజుల పాటు పగలు, రాత్రి రెక్కీ నిర్వహించి మొత్తం 14 మంది సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్నారు. పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకురావడానికి వారిని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. తమ పిల్లలను అరెస్ట్ చేయవద్దంటూ నిందితుల తల్లిదండ్రులు, బంధువులు సుమారు 50 మంది న్యాయస్థానం వద్ద ఆందోళన చేశారు. అయినా ఢిల్లీ న్యాయస్థానం లెక్కచేయలేదు.


నిందితుల ఆర్థిక నేరాలకు సంబంధించి ఆధారాలు హైదరాబాద్‌ పోలీసులు సమర్పించడంతో వారిని తీసుకెళ్లేందుకు అంగీకరిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వారిని నగరంలోని ఓ న్యాయస్థానంలో హాజరుపరచడానికి తీసుకెళ్లారు. అయితే, టెక్నికల్‌గా వారిని రిమాండ్‌ చేయడం కుదరదని చెప్పడంతో కంగుతిన్నారు. దాంతో మరిన్ని ఆధారాలు, టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిందితులను మరోసారి కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. 


రుణాల పేరుతో..

బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న కస్టమర్ల డేటాను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేశారు. ఢిల్లీలో ప్రత్యేక కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్‌ చేసేవారు. ‘మీకు బ్యాంకు రుణం మంజూరైంది. ప్రాసెసింగ్‌ ఫీజు కింద కొంత మొత్తం చెల్లిస్తే డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తాం’ అని నమ్మించేవారు. ఇలా ఏదో ఒక సాకు చెప్పి విడతల వారీగా కొందరి నుంచి లక్షల్లో వసూలు చేసేవారు. దేశవ్యాప్తంగా వందలమందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొట్టారు. 

Updated Date - 2021-12-02T16:41:48+05:30 IST