దసరాకు ఊరెళ్తున్నారా.. అయితే దొంగలకు ‘పండుగ’ కానివ్వకండి!

ABN , First Publish Date - 2021-10-15T14:56:26+05:30 IST

నగరంలో పండుగ సందడి కనిపిస్తోంది. నగరవాసులు ఎక్కువ మంది ఇంటికి తాళాలు

దసరాకు ఊరెళ్తున్నారా.. అయితే దొంగలకు ‘పండుగ’ కానివ్వకండి!

హైదరాబాద్‌ సిటీ : నగరంలో పండుగ సందడి కనిపిస్తోంది. నగరవాసులు ఎక్కువ మంది ఇంటికి తాళాలు వేసి దసరా పండగకు ఊళ్లకు వెళ్లారు. ఎక్కడా దోపిడీలు... చోరీలు జరగకుండా ముందస్తు చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 


అప్రమత్తంగా ఉండాల్సిందే : పోలీసులు

దొంగల భయంతో సంబరాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. నగర పౌరులు తమ బాధ్యత జాగ్రత్తగా నిర్వహిస్తే.. పోలీసులూ తమ పాత్ర అప్రమత్తంగా పోషించే అవకాశముంటుంది.  

-  పండుగకు తాళాలు వేసి ఉన్న ఇళ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకుంటారు. తాళం వేస్తున్న సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, నగదు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా భద్రత ఉన్న ప్రాంతాల్లో దాచితే మంచిది. 

- పక్కింటి వారికి... స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. ఎప్పుడు వెళ్తున్నారు... తిరిగి ఎప్పుడు తిరిగి వస్తారనే విషయాలను పోలీస్ స్టేషన్‌లో చెబితే రాత్రి సమయాల్లో పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా మరింత పెంచే అవకాశముంటుంది.


- ఇళ్ల మీద సీసీ కెమెరాలు ఉండటం ఉత్తమం. ఒకవేళ లేకుంటే సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు.. బస్తీ కెమెరాల గురించి అవగాహన కలిగి ఉండాలి.  

- ఇళ్లకు తాళం కనిపించినట్లు కాకుండా... లోపలి నుంచి గడియ పెట్టి వెనక ద్వారానికి తాళం వేసి.. ఇంట్లో ఉన్న లైట్లను ఆన్‌ చేసి ఉంచితే... ఇంట్లో జనం ఉన్నట్లు కనిపిస్తుంది. 

- ఇండిపెండెంట్‌... ఏకాంతంగా ఉన్న ఇళ్లల్లో నివసించే వారికి రిస్క్‌ ఎక్కువ ఉన్నందున్న తప్పకుండా పోలీసుల సాయం తీసుకోవాలి. 

- నాసిరకం తాళాలు వాడరాదని, తాళం వేసిన అనంతరం బయటకు కనబడకుండా కర్టెన్లు వేయాలన్నారు. లోపల లైట్లు ఆన్‌లో ఉంచాలని అధికారులు చెబుతున్నారు. 

- ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పండగ హాయిగా జరుపుకోవడమే కాకుండా నేరాలను అదుపు చేసినట్లు అవుతుంది. ఏదైనా ఇబ్బంది.. సమస్య వచ్చినప్పుడు డయల్‌ 100 ద్వారా పోలీసులను సంప్రదించే అవకాశముంటుంది. 

Updated Date - 2021-10-15T14:56:26+05:30 IST