గ్రేటర్‌లో తెరుచుకోని పార్కులు.. ఇబ్బందుల్లో నగరవాసులు

ABN , First Publish Date - 2021-06-17T19:24:28+05:30 IST

జూబ్లీహిల్స్‌ జర్నలిస్టులో కాలనీలో నివసించే వెంకట్‌, నాగరాజు రోజూ ఉదయం కేబీఆర్‌ పార్కులో...

గ్రేటర్‌లో తెరుచుకోని పార్కులు.. ఇబ్బందుల్లో నగరవాసులు

  • రోడ్లపైనే వాకింగ్‌
  • ఇందిరాపార్కులో ఇటీవలే అనుమతి


హైదరాబాద్‌ సిటీ : చిక్కడపల్లిలో నివసించే వెంకటేశ్వర్లుకు ఉదయాన్నే బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య పార్కుకు వెళ్లి వాకింగ్‌ చేయడం అలవాటు. కరోనాతో నెల రోజుల నుంచి పార్కులోకి ఎవరినీ అనుమతించడం లేదు. లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో వాకింగ్‌ కోసం పార్కుకు వెళ్లగా మూసి ఉంది. దీంతో వీధిలోనే రోడ్డుపై వాకింగ్‌ చేస్తుండగా, ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. వెంకటేశ్వర్లు అప్రమత్తమైనా కాలికి గాయమైంది. 


జూబ్లీహిల్స్‌ జర్నలిస్టులో కాలనీలో నివసించే వెంకట్‌, నాగరాజు రోజూ ఉదయం కేబీఆర్‌ పార్కులో నడిచేవారు. కొన్నాళ్ల తర్వాత బుధవారం కేబీఆర్‌ పార్కుకు వెళ్ళారు. వాకింగ్‌ ట్రాక్‌పైకి చేరుకునే లోపే... కరోనా సమయంలో వాకింగ్‌కు ఎలా వచ్చారని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తమకు డబుల్‌ మాస్క్‌ ఉందని చెప్పినా వినిపించుకోలేదు. ఇదే తరహాలో చాలా మంది వాకర్లు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌తో సంజీవయ్య పార్కు, కేబీఆర్‌ పార్కు, ప్రియదర్శిని పార్కు, మేల్కోటే పార్కు, వెంగల్‌రావు పార్కు, కృష్ణాకాంత్‌ పార్కు, సుందరయ్య పార్కు ఇలా పలు ప్రాంతాలు, కాలనీలోని పార్కులన్నీ మూతపడ్డాయి. ఇప్పటికీ తెరుచుకోలేదు. వాకింగ్‌ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటే.. కరోనా కారణంగా వాకింగ్‌కు రావద్దని పోలీసులు వాకర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.


ఒక్క పార్కులోనే...

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వాకర్లను అనుమతించాలని నిర్వాహకులకు ఇందిరాపార్కు వాకర్స్‌ అసోసియేషన్‌ వినతిపత్రం సమర్పించింది. దాంతో ఉదయం 5.30 నుంచి 9 వరకు మూడున్నర గంటల పాటు వాకర్లకు అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చూస్తున్నారు. ఈ ఒక్క పార్కులో మాత్రమే వాకర్లకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. నగరంలోని ఇతర పార్కుల గేట్లు తెరుచుకోలేదు.


తెరుచుకోని పార్కులు...

కాలనీ అసోసియేషన్ల అధీనంలో ఉన్న పార్కుల్లో స్థానికులు వాకింగ్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నిర్వహణలో, సెక్యూరిటీ సిబ్బంది ఉన్న పార్కులేవీ తెరుచుకో లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌ సర్కిల్‌లో 40 పార్కులు, శేరిలింగంపల్లి సర్కిల్‌లో 48 పార్కులు ఉన్నాయి. వీటితో పాటుగా బొటానికల్‌ గార్డెన్‌, పాలపిట్ట సైక్లింగ్‌ట్రాక్‌ ఉన్నాయి. వాకర్స్‌ విజ్ఞప్తితో బొటానికల్‌ గార్డెన్‌ను మాత్రమే లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో తెరిచి ఉంచారు. మిగతావన్నీ మూతపడే ఉన్నాయి. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వ్యాయామానికి అనుకూలంగా ఉన్న పార్కులను తెరిపించాలని పలువురు కోరుతున్నారు. మాల్స్‌కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం పార్కుల్లోకి వాకర్లను అనుమతి ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.


వాకింగ్‌తో ఉపయోగాలు ఇవీ..

- గుండె జబ్బులు త్వరగా రావు. రక్త సరఫరా మెరుగవుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.

- నడక ద్వారా శరీరంలో విడుదలయ్యే ఎండోర్ఫిన్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు.

- కండరాలు చురుగ్గా మారతాయి. కీళ్లు, ఎముకలు గట్టిపడతాయి. 

- రోజూ నడిస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. వెన్నెముక ప్రాంతంలో రక్త సరఫరా మెరుగవుతుంది. బ్యాక్‌ పెయిన్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. 


వాకర్లను అనుమతించాలి..

పార్కులలోకి వాకర్లను అనుమతించడం లేదు. దాంతో వీధుల్లో నడవాల్సి వస్తోంది. షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకున్నాయి. నిబంధనలు పాటిస్తూ పార్కుల్లోకి వాకింగ్‌కు అనుమతిస్తే ఇబ్బందులుండవు. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. - కె.వీరయ్య, ఉపాధ్యక్షులు, హైదరాబాద్‌ జిందాబాద్‌


అవగాహన కల్పించాలి.. 

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడానికి, వ్యాయామం చేసుకోవడానికి అనుకూలంగా పార్కులను తెరవాలి. నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. - గోపాలరావు, హెచ్‌ఎంటీకాలనీ సభ్యుడు.

Updated Date - 2021-06-17T19:24:28+05:30 IST