Abn logo
Sep 27 2021 @ 12:30PM

ప్రభుత్వమే కాపాడాలి

కుంచించుకుపోతున్న పల్లెచెరువు

వెలుస్తున్న నిర్మాణాలు

తమకు పట్టా ఉందని ఆనవాళ్లు మాయం

ప్రభుత్వాన్ని వేడుకొంటున్న స్థానికులు


హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లిలో ఉన్న పల్లెచెరువు రాను రాను నిర్మాణాలతో కుచించుకుపోతోంది. పురాతన కాలం నుంచి ఈ చెరువులో వినాయక నిమజ్జనాలు, బతుకమ్మ వేడుకలు, దసరా పండుగ సందర్భంగా జమ్మిపూజ కార్యక్రమాలు, చెరువుకట్టపై ఉన్న అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. 

ఐదు సంవత్సరాల క్రితం ఉన్న చెరువు విస్తీర్ణం ప్రస్తుతం కుంచించుకుపోయింది. కొందరు చెరువు ప్రాంతం తమ పేరున పట్టా ఉందని మట్టిపోస్తూ చదును చేస్తూ చెరువు ఆనవాళ్లు లేకుం డా చేస్తున్నారు. చెరువుకు తూర్పు వైపు మినహాయిస్తే మిగతా మూడు వైపుల నుంచి చెరువు శిఖం స్థలంలో నిర్మాణాలు వెలిశాయి. ఒక వైపు ఇంజనీరింగ్‌ కళాశాలల నిర్వాహకులు, మరో వైపు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, ఇంకొక వైపు ప్రజలు ఇళ్లను నిర్మించుకున్నారు. కొంతమంది చెరువులో మట్టి పోస్తూనే ఉన్నారు.

 

రికార్డులో శిఖం చెరువు

పల్లెచెరువు సుమారు ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో విస్తరించి ఉందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డు ల్లో మాత్రం పల్లెచెరువు మొత్తం శిఖం పట్టా అని ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో మట్టిపోసి షెడ్లు ఏర్పాటు చేసి తర్వాత పర్మినెంటు నిర్మాణాలను నిర్మిస్తున్నారు. 


నిర్మాణాలు చేపట్టొద్దు

చెరువు శిఖం స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్థానికులు వేడుకొంటున్నారు. నీళ్లు లేని సమయంలో వ్యవసాయం మాత్రమే చేయాలని, కొందరు తమ పేరున శిఖం పట్టా ఉందని మట్టిపోసి చెరువు ఆనవాళ్లను చెరిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెచెరువు తమ తాతల కాలం నాటి చెరువని, ఈ చెరువు ప్రభుత్వ చెరువెనని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ అన్ని పండుగలు వైభవంగా జరిగేవని, ప్రస్తుతం చెరువు వద్ద ఎలాంటి పండుగలు చేసుకోవాలన్నా కబ్జాలతో మంచి వాతావరణం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. పల్లెచెరువు ప్రైవేటు వ్యక్తుల పేరున పట్టా ఉంటే చెరువులో నీరు ఉన్నంత కాలం దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, చెరువు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసి పల్లెచెరువు ప్రజలకోసం ఉపయోగపడేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


గత సంవత్సరం ఎనిమిది మంది గల్లంతు

గత సంవత్సరం అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జల్‌పల్లి పెద్ద చెరువు నిండి వరద నీరు పల్లెచెరువులోకి రావడంతో అలుగుపారింది. దీంతో పల్లెచెరువు కింది భాగంలో ఉన్న అలీనగర్‌ నాలా పొంగడంతో అలీనగర్‌కు చెందిన ఓ కుటుంబంలోని తొమ్మిది మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా అందులో ఎనిమిది మంది చనిపోయారు. ఒకరు మాత్రం చెట్టును పట్టుకుని బతికిపోయారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృత్తం కాకుండా చెరువు విస్తీర్ణం తగ్గకుండా ప్రభుత్వమే కాపాడాలి. 


వ్యవసాయం మాత్రమే చేయాలి

పల్లెచెరువు మొత్తం శిఖం పట్ట అని రికార్డులో ఉంది. ఈ చెరువు రాజేంద్రనగర్‌, బండగూడ మండలాల పరిధిలో విస్తరించి ఉంది. అయినా చెరువులో నీరు ఉన్నప్పుడు ఎవరూ భంగం చేయకూడదు. నీరు లేనప్పుడు వ్యవసాయం మాత్రమే చేయాలి. మట్టిపోయడం, చెరువులో నిర్మాణాలు చేపట్టడం చేస్తే చర్యలు తీసుకుంటాం. 

- కె.చంద్రశేఖర్‌గౌడ్‌, తహసీల్దార్‌