హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-02-27T13:17:52+05:30 IST

నగరంలోని వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధి హస్తినపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధి హస్తినపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువెళ్తున్న ఓ కారు(TS05FH2356) అదుపుతప్పి  ట్రాఫిక్ సిగ్నల్ స్థంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైనుండి మరోపక్కకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు సాగర్ రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  కారులో ప్రయాణిస్తున్న యువకుల్లో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా...మరో యువకుడు పరారయ్యాడు.  గౌతమ్‌ అనే యువకుడు కారును నడుపుతున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఈ కేసుకు సంబంధించి ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... వనస్థలిపురం బీఎన్ రెడ్డి సిగ్నల్ పోస్ట్‌లో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిందని... వెనుక కూర్చున్న సందీప్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడని చెప్పారు. గౌతమ్ అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. గౌతమ్ ఎక్కువగా మద్యం సేవించారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సందీప్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పరారైన వ్యక్తి మల్లికార్జున్ ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా, గౌతమ్ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్‌తో నే ప్రమాదం జరిగిందని..గౌతమ్‌పై 304 ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-02-27T13:17:52+05:30 IST