జల్సాల కోసం బావ, బామ్మర్దుల చోరీల బాట

ABN , First Publish Date - 2021-06-18T16:54:16+05:30 IST

వాళ్లిద్దరూ బావ బామ్మర్దులు.. ఒకరు డిప్లొమా విద్యార్థి కాగా మరొకరు కూలీ. లాక్‌డౌన్‌తో ఇంట్ల్లోనే ఉంటున్న ఈ ఇద్దరూ తమ జల్సాల కోసం దొంగతనాల బాటపట్టారు

జల్సాల కోసం బావ, బామ్మర్దుల చోరీల బాట

నిందితుల అరెస్ట్‌, 70 గ్రాముల బంగారు నగలు, బైక్‌ స్వాధీనం


హైదరాబాద్/సరూర్‌నగర్‌: వాళ్లిద్దరూ బావ బామ్మర్దులు.. ఒకరు డిప్లొమా విద్యార్థి కాగా మరొకరు కూలీ. లాక్‌డౌన్‌తో ఇంట్ల్లోనే ఉంటున్న ఈ ఇద్దరూ తమ జల్సాల కోసం దొంగతనాల బాటపట్టారు. గురువారం మీర్‌పేట్‌ పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.4.10లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు గురువారం పీఎ్‌సలో ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, డీఐ సత్యనారాయణతో కలిసి వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం రేఖియాతండాకు చెందిన కెతావత్‌ నర్సింగ్‌ అలియాస్‌ నరి(25) హస్తినాపురం శ్రీరమణ కాలనీలో అద్దెకు ఉంటూ చైతన్యపురిలోని ఓ హోటల్‌లో పని చేసేవాడు. నల్గొండ జిల్లా డిండి మండలం సోమ్లా తండాకు చెందిన ఇస్లావత్‌ విఘ్నేశ్‌ అలియాస్‌ గణేశ్‌(19) గుర్రంగూడలోనీ బీరప్పగుడి సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నాడు. నర్సింగ్‌, విఘ్నేశ్‌ ఇద్దరూ బావా బామ్మర్దులు. వారిద్దరు తమ జల్సాల కోసం అవసరమైన డబ్బుల కోసం మహిళల మెడలోని గొలుసులు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మీర్‌పేట్‌ నందిహిల్స్‌లో గత మార్చి 31న వెదురు బొంగుల దుకాణం నిర్వహించే భాగ్యలక్ష్మి అనే మహిళ వద్దకు వచ్చి, బేరం చేస్తున్నట్టుగా నటించి, ఆమె మెడలోని ఆరు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. ఇదే తరహాలో మరో చెయిన్‌ స్నాచింగ్‌కూ పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి గురువారం హస్తినాపురంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 70 గ్రాముల బంగారు నగలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. సొత్తువిలువ రూ.4.10 లక్షలు ఉంటుందని ఏసీపీ చెప్పారు.

Updated Date - 2021-06-18T16:54:16+05:30 IST