Abn logo
Oct 23 2021 @ 02:38AM

హైదరాబాద్‌ రియల్టీకి ఐటీ అండ

  • కార్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్‌ గమ్యస్థానం
  • హైసియా శ్వేత పత్రం విడుదల


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సేవల రంగం గత ఐదేళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. ఐటీ రంగంలో జోరు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదపడింది. ఐటీ, లైఫ్‌సైన్సెస్‌, ఎలకా్ట్రనిక్స్‌ తదితర రంగాల కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు, బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలు, స్థానిక ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్‌ అత్యంత గమ్యస్థానంగా మారిందని హైదరాబాద్‌ కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌పై విడుదల చేసిన శ్వేత పత్రంలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వెల్లడించింది. శుక్రవారం జరిగిన రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సులో సీబీఆర్‌ఈతో కలిసి హైసియా దీన్ని విడుదల చేసింది. 2021 మూడో త్రైమాసికంనాటికి హైదరాబాద్‌లో 9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉందని, వచ్చే రెండు మూడేళ్లలో మరో 3-3.5 కోట్ల చదరపు అడుగు ఆఫీ్‌సస్పేస్‌ అందుబాటులోకి రానుందని శ్వేత పత్రంలో పేర్కొన్నారు.


కాగా గత ఏడేళ్లలో హైదరాబాద్‌లో రోడ్లు, బ్రిడ్జీల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలంగాణ మున్సిపల్‌ పాలన, పట్టణ అభివృద్ధి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. హైసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సులో అరవింద్‌ కుమార్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. తెలంగాణలో 4,445 మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉందని ఎనర్జీ విభాగం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ తెలిపారు. హైదరాబాద్‌లో మహీంద్రా గ్రూప్‌ అనేక కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఈవీల తయారీ యూనిట్‌ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తామని మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీఈఓ సుమన్‌ మిశ్రా అన్నారు. హైదరాబాద్‌లో మెడికల్‌ టూరిజంను అభివృద్ధి చేయాలని ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డి నాగేశ్వర్‌ రెడ్డి కోరారు.