ప్రేమే సర్వస్వం అనుకుంటే.. కట్నం కాటేసింది

ABN , First Publish Date - 2021-06-23T18:17:02+05:30 IST

కట్నం కోసం ప్రియుడు మరొకరిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవడంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ సంఘటన

ప్రేమే సర్వస్వం అనుకుంటే.. కట్నం కాటేసింది

ప్రేమే సర్వస్వం అనుకున్న ఉమ

ప్రియుడి నోట..  కట్నం పాట

విరక్తితో యువతి ఆత్మహత్య

వెంగళరావునగర్‌లో మరో ఉదంతం

భర్త, అత్తమామలతో పోరాడుతున్న ప్రగతి


పైకి మనం ఎన్ని కబుర్లు చెప్పినా... సమాజంలో దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బలహీనుల్ని బలి తీసుకుంటూనే ఉన్నాయి. కనబడకుండా కథ నడిపించే వరకట్నం వ్యవహారం అలాంటిదే. ప్రేమ ముందు.. డబ్బూ గిబ్బూ దేనికీ విలువ లేదని నమ్మిన ఓ యువతి.. ప్రియుడి వరకట్నం పాట విని జీవితాన్ని అంతం చేసుకున్న బాధాకరమైన సంఘటన ఒకటి కాగా, పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత కూడా కట్నం పీడను ఎదుర్కోవాల్సి వస్తున్న ఉదంతం మరొకటి. 


హైదరాబాద్/మద్దిరాల: కట్నం కోసం ప్రియుడు మరొకరిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవడంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకోగా, ఆమె స్వగ్రామం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో దుఃఖభరిత వాతావరణం ఏర్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రామచంద్రు, లక్ష్మమ్మలకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రామచంద్రు వ్యవసాయ కూలీ. ఇప్పటికే ముగ్గురు కుమార్తెల వివాహాలు చేశాడు. నాలుగో కుమార్తె ఉమ(22), కుమారుడు లింగమల్లు హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఉమ బీ ఫార్మశీ, రాజమల్లు బీటెక్‌ చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో కళాశాలలు మూసివేయడంతో ఉమ గ్రామానికి వచ్చింది. 

అదే గ్రామానికి చెందిన యువకుడు ఉమేష్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా ఉమేష్‌, ఉమ ప్రేమించుకుంటున్నారు. అయితే, పెళ్లి  చేసుకోవాలంటే కట్నం కావాలని ఉమను అడిగాడు. తన తల్లిదండ్రులు కట్నం ఇచ్చుకోలేరని ఉమ చెప్పింది. దీంతో ఈ నెల 20న మరో యువతితో ఉమే్‌షకు వివాహం చేసేందుకు అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న ఉమ మనస్తాపానికి గురై సోమవారం ఇంటి నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. తమ్ముడు లేకుండా ఎలా వెళ్తున్నావని తల్లిదండ్రులు ప్రశ్నించగా, ఉద్యోగం చూసుకునేందుకు వెళ్తున్నట్లు సమాధానమిచ్చింది. మంగళవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె ఉంటున్న అద్దె ఇంటి తలుపులు మూసి ఉండడం, ఇంటి ఓనర్‌ ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కిటికీ అద్దాలు తొలగించి చూడగా ఉమ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని ఉమేష్‌ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు.


అత్తింటి కాఠిన్యం

వెంగళరావునగర్‌: అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా కోడలు ఇంట్లోకి రావద్దని భావించిన అత్తింటి వారు తాళం వేసి వెళ్లిపోయారు. చాలా సేపు ఎదురుచూసిన కోడలు బలవంతంగా తాళం తెరిపించి ఇంట్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు ఆమెతో గొడవకు దిగారు. వివరాల్లోకి వెళ్తే. ఘట్‌కేసర్‌ ఎన్‌ఎ్‌ఫసి నగర్‌కు చెందిన ప్రగతికి నాలుగు సంవత్సరాల క్రితం వెంగళరావునగర్‌కు చెందిన సురేష్‌ కుమార్‌తో వివాహం జరిగింది. వారికి పాప ఉంది. కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం ఆమెను అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక సరూర్‌ నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్లో ప్రగతి ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్త, అత్తమామలు, ఇద్దరు మరుదులపై వరకట్నం వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


నాలుగు రోజుల క్రితం ప్రగతి అత్త వారింటికి రాగా వారు తాళం వేసుకుని వెళ్లిపోయారు. కూతురితో ఆమె ఇంటి బయట ఎదురుచూసింది. కూతురికి బాగా లేకపోవడంతో వేరే తాళం చెవులు తయారు చేయించి, ఇంట్లోకి వెళ్లింది. నాలుగు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. విషయం తెలుసుకున్న భర్త, అత్తమామలు మంగళవారం ఇంటికి వచ్చారు. ఆమెతో ఘర్షణకు దిగారు. తనకు ఇంట్లో ఉండే హక్కు ఉందని వారికి ప్రగతి స్పష్టం చేసింది. అత్తమామలు సంజీవరెడ్డి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కుటుంబ సమస్య కావడంతో మీరే చూసుకోవాలని పోలీసులు సూచించారు. అత్తింటి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ప్రగతి కోరుతోంది. 

Updated Date - 2021-06-23T18:17:02+05:30 IST