Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీటి బిల్లు గుండె గుభిల్లు.. ఒకేసారి ఐదు నెలల డిమాండ్‌

  • ఒకేసారి ఐదింతలు కావడంతో హడలిపోతున్న జనం 
  • లాక్‌డౌన్‌లో చెల్లింపులకు ఇబ్బందులు
  • గంపగుత్తగా నీటి యూనిట్ల లెక్కింపు
  • వినియోగదారులపై  భారం

హైదరాబాద్‌ సిటీ : బోరబండ పరిధి గాయత్రినగర్‌లో ఓ ఇంటికి నల్లా కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌ 614462191. నీటి బిల్లులో ఆధార్‌ అనుసంధానం చేసుకున్నట్లు ఉంది. మెకానికల్‌ మీటర్‌ ఉన్నట్లుగా వాటర్‌బోర్డు అధికారుల రికార్డులో ఉంది. అయినప్పటికీ డిసెంబర్‌ నెల నుంచి ఏప్రిల్‌ వరకు గంపగుత్తగా 332 కిలో లీటర్ల నీటిని వినియోగించినట్లుగా ఐదు నెలలకు బిల్లు వేశారు. సాధారణంగా ఆ ఇంటికి నెలకు రూ.320 మాత్రమే నీటి బిల్లు వచ్చేది. ఉచిత తాగునీటి పథకం అమలు తర్వాత నెలకు సుమారు రూ.వెయ్యికి పైబడి చార్జీల చొప్పున ఐదు నెలలకు రూ.5,371 వరకు బిల్లు రావడం గమనార్హం. ఐదు నెలల నీటి యూనిట్లను ఒకేసారి లెక్కగట్టడం వల్ల చార్జీ అధికంగా పడిందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.


సాయినాథ్‌పురంలో ఉండే ఓ ఇంటి నల్లా కనెక్షన్‌ ఆధార్‌కు లింకు అయి ఉంది. మీటర్‌ బిగింపు  ప్రక్రియ కూడా పూర్తయింది. ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులుగా ఎంపికైనట్లు మొబైల్‌కు సమాచారం వచ్చింది. హమ్మయ్య.. నెలకు రూ.250 నీటి బిల్లు స్థానంలో ఇప్పుడు జీరో బిల్లు వస్తుందని యజమాని భావించారు. అందుకు భిన్నంగా ఐదు నెలలకు రూ.1560 బిల్లు వచ్చినట్లు మొబైల్‌కు సమాచారం వచ్చింది. మీటర్‌ మరమ్మతుకు గురవడం వల్ల బిల్లు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో చాలా మందికి ఇలాంటి షాక్‌లు తగులుతున్నాయి. ఐదు నెలలకు ఒకేసారి జారీ అవుతున్న బిల్లులతో గుండె ఝల్లుమంటున్నాయి.

నల్లా కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేసి, నల్లాలకు మీటర్‌ బిగించుకున్నా బిల్లుల మోత మోగుతోంది. నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం ద్వారా జీరో బిల్లులు వస్తాయని ఆశించినవారికి వేలకు వేలు నీటి బిల్లు వస్తోంది. సకాలంలో చెల్లించకపోతే మరుసటి నెల నుంచే బిల్లులపై జరిమానా, వడ్డీలు కూడా విధిస్తామని బోర్డు  హెచ్చరిస్తోంది. సాధారణంగా ఏ నెల బిల్లును ఆ నెల సరాసరి ప్రకారం నిర్ణయించాల్సి ఉండగా, ఐదు నెలల యూనిట్‌ చార్జీలన్నింటినీ ఒకేసారి లెక్కిస్తున్నారు. దాంతో కిలో లీటర్‌కు విధించాల్సిన చార్జి కంటే అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ బిల్లులు మరింత భారంగా మారుతున్నాయి. ఉచిత తాగునీటి పథకంలో భాగంగా గృహ కనెక్షన్‌దారులు తమ క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకొని, నల్లా కనెక్షన్‌కు మీటర్‌ బిగించుకునేందుకు ఏప్రిల్‌ 30 వరకు బోర్డు గడువు ఇచ్చింది. ఆ సమయంలో నీటి బిల్లులు జారీ చేయలేదు. పథకం లబ్ధి పొందేందుకు ఇచ్చిన గడువు పూర్తయింది. దీంతో మీటర్‌ రీడర్లు కరోనాతో ఇంటింటికీ తిరగకుండా, ఆధార్‌ అనుసంధానం అయిందా లేదా పరిశీలించకుండా గంపగుత్తగా బిల్లులు జారీ చేస్తున్నారు.


మారిపోతున్న స్లాబ్స్‌..

ఏ నెలకు ఆ నెల స్లాబ్‌ ప్రకారం నీటి బిల్లు వేయడం లేదు. ఐదు నెలల మొత్తానికి కిలో లీటర్లతో స్లాబ్‌ ఒకేసారి లెక్కకట్టడంతో బిల్లు నాలుగైదింతలు పెరుగుతోంది. నెలకు 20 కిలో లీటర్లను వినియోగించి రూ.12 స్లాబ్‌లో ఉండే ఇంటి యజమానికి ప్రస్తుతం ఐదు నెలల్లో 100 కిలో లీటర్లకు పైగా వినియోగించారని, రూ.35 స్లాబ్‌ ప్రకారం బిల్లు వేస్తున్నారు. వెయ్యి లీటర్లకు (కిలోలీటర్‌) రూ.10, రూ.12 చొప్పున ప్రతి నెలా నీటి బిల్లు చెల్లించే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇప్పుడు రూ.35, రూ.45 లెక్కన బిల్లు పడుతోంది. జీరో బిల్లులు వస్తాయనుకున్న తరుణంలో భారీ స్థాయిలో బిల్లులు రావడంతో వినియోగదారుల గుండెలు గుభిళ్లు మంటున్నాయి.


పథకంలో ఎప్పుడైనా చేరొచ్చు..

ఉచిత తాగునీటి పథకంలో చేరేందుకు ఏప్రిల్‌ 30 వరకు వాటర్‌బోర్డు గడువు ఇచ్చింది. సుమారు నాలుగు లక్షల మంది తమ ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకున్నారు. రెండు లక్షలకు పైగా మీటర్లకు బిగించుకున్నారు. వారికి డిసెంబర్‌ నెల నుంచి నెలకు 20 వేల లీటర్ల చొప్పున ఉచితం వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కూడా ఉచిత తాగునీటి పథకంలో చేరవచ్చని, క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం, నల్లాకు మీటర్‌ బిగింపు చేసుకుంటే ఈ పథకం వర్తిస్తుందని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌ నెల నుంచి గడిచిన ఐదు నెలలకు బిల్లు యథావిధిగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఐదింతలు ఒకేసారి.. 

నగరంలో అత్యధిక కనెక్షన్లకు నీటి బిల్లులను ఇంటింటికి తిరిగి జారీ చేయడం లేదు. చాలా వరకు ఎస్‌ఎంఎస్‌ ద్వారానే సమాచారమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే రీడర్లు ఇంటింటికి తిరిగి బిల్లులు వేస్తున్నారు. ఆధార్‌ అనుసంధానానికి సంబంధించిన రికార్డు అధికారుల వద్ద ఉన్నప్పటికీ, మీటర్‌ బిగించుకున్నట్లుగా రికార్డు లేదు. దీనికితోడు ఇళ్లకు వెళ్లి పరిశీలన చేయకపోవడంతో మీటర్లు బిగించుకున్నవారికి కూడా బిల్లులు వేస్తున్నారు. ఐదు నెలల బిల్లు మొత్తంలో ఒకేసారి పంపుతున్నారు. నోటిఫైడ్‌ మురికివాడల్లోని కనెక్షన్‌దారులకు కూడా జీరో బిల్లులు గాకుండా నీటి బిల్లులే వచ్చాయి. దీంతో లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు.

Advertisement
Advertisement