షార్జాలో ఉన్న కూతురిని కాపాడాలంటూ.. విదేశాంగశాఖకు హైదరాబాద్ మహిళ లేఖ

ABN , First Publish Date - 2021-02-23T10:21:06+05:30 IST

లాక్‌డౌన్‌లో భర్త చనిపోయాడు.. కుటుంబాన్ని పోషించే బాధ్యతను తన భుజాలకెత్తుకుంది.. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక.. ఒకవేళ ఉన్నా అత్తెసరు కూలీ ఉండడంతో అల్లాడిపోయింది.. ఆమె పరిస్థితిని అవకాశంగా మలచుకున్న ఏజెంట్లు షార్జాలో పెద్ద జీతం పేరుతో మోసగించారు.

షార్జాలో ఉన్న కూతురిని కాపాడాలంటూ.. విదేశాంగశాఖకు హైదరాబాద్ మహిళ లేఖ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో భర్త చనిపోయాడు.. కుటుంబాన్ని పోషించే బాధ్యతను తన భుజాలకెత్తుకుంది.. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక.. ఒకవేళ ఉన్నా అత్తెసరు కూలీ ఉండడంతో అల్లాడిపోయింది.. ఆమె పరిస్థితిని అవకాశంగా మలచుకున్న ఏజెంట్లు షార్జాలో పెద్ద జీతం పేరుతో మోసగించారు.. అరబ్‌ షేక్‌ కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుని, వెట్టిచాకిరీ చేస్తోంది.. నగరానికి చెందిన ఓ యువతి దీన గాథ ఇది.. తన కూతురిని వెనక్కి రప్పించాలంటూ బాధితురాలి తల్లి విదేశాంగ శాఖకు లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన జరీనాబేగం భర్త షేక్‌బాబు లాక్‌డౌన్‌ సమయంలో మృత్యువాత పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జరీనాబేగం ఉద్యోగ అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న హామెద్‌, ఆఫ్రీన్‌ అనే ఏజెంట్లు జరీనాను సంప్రదించారు. 


షార్జాలో మంచి జీతం ఉంటుందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన జరీనా.. గత ఏడాది నవంబరు 15న షార్జా చేరుకుంది. అక్కడ మరో ఏజెంటు ఆమెను  ఓ అరబ్‌షేక్‌కు అప్పగించాడు. 20 మందికి పైగా సభ్యులుండే కుటుంబంలో పనికి పెట్టారు. అక్కడ ఆమెతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారు. తెల్లవారుజాముకు ముందే నిద్రలేపి పని పురమాయిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా పనిచేయాల్సిందేనని ఆర్డరేస్తున్నారు. పనిలో ఆలస్యం జరిగితే.. కొడుతున్నారు. చిన్నతనంలో జరీనాకు కాలిన గాయాలు ఉండడంతో.. ఇప్పుడు అరబ్‌షేక్‌ కుటుంబం పెడుతున్న చిత్రహింసలకు ఆ గాయం తిరగబడింది. 


ఇన్ఫెక్షన్‌ తీవ్రమై అనారోగ్యంపాలైంది. చిక్కి శల్యమైపోయింది. అయినా.. చెప్పిన పనిచేయాల్సిందేనని ఆమెకు నరకం చూపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జరీనా తల్లి సుల్తానా బేగం.. తల్లడిల్లిపోయారు. తన కూతురిని వెనక్కి రప్పించాలంటూ కనిపించిన వారినల్లా కన్నీటి పర్యంతం వేడుకుంటున్నారు. తన కూతురి దుస్థితిని వివరిస్తూ.. విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

Updated Date - 2021-02-23T10:21:06+05:30 IST