సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-06-17T14:24:23+05:30 IST

గోల్కొండ పీఎస్‌ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును

సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

  • ఆభరణాల కోసమే మహిళ హత్య
  • కేసును ఛేదించిన పోలీసులు
  • కూలీకని తీసుకెళ్లి.. హతమార్చిన మేస్త్రీ

హైదరాబాద్‌ సిటీ : గోల్కొండ పీఎస్‌ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను కాజేసేందుకు హతమార్చినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన గంజి వెంకటేశ్‌ (35) గోల్కొండలోని గుల్షన్‌ కాలనీలో నివాసముంటున్నాడు.


మేస్త్రీ వృత్తిలో ఉన్న వెంకటేశ్‌ మణికొండ లేబర్‌ అడ్డా నుంచి రోజూ కూలీలను తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో పని చేయిస్తుంటాడు. ఈ నెల 9న మణికొండ లేబర్‌ అడ్డా వద్ద మహబూబ్‌నగర్‌ జిల్లా గుండియాల్‌ గ్రామానికి చెందిన బునేటి చెన్నమ్మ (45) పనికోసం వేచి ఉంది. ఆమె ఒంటిపై వెండి ఆభరణాలు చూసిన వెంకటేశ్‌ అవి కాజేయాలని ప్లాన్‌ చేసుకున్నాడు. భర్త ఆంజనేయులుతో కలిసి ఉన్న ఆమె వద్దకు వెళ్లి మాదాపూర్‌లో పని ఉంది అని చెప్పాడు. చెన్నమ్మతో మణికొండ నుంచి కొంత దూరం వెళ్లి, అమెను అక్కడ వదిలేసి వెంకటేశ్‌ వెళ్లాడు. తర్వాత తిరిగొచ్చిన వెంకటేశ్‌ అక్కడ పనిలేదని చెప్పడంతో మహిళ ఇంటికి వెళ్తానని చెప్పింది.


ఆమెకు మాయమాటలు చెప్పి కల్లు తాగుదామని ఒప్పించి దర్గా వద్ద ఉన్న కాంపౌండ్‌లోకి వెళ్లి కల్లు తాగారు. ఆ తర్వాత మరో చోట మద్యం కూడా కొనుగోలు చేసి షేక్‌పేట్‌లోని సక్కుబాయ్‌ సొసైటీ వద్ద ఉన్న శ్మశానంలోకి తీసుకెళ్లి అక్కడ మద్యం తాగారు. తర్వాత చెన్నమ్మ స్పృహ కోల్పోగా  రాడ్‌తో ఆమెపై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్‌ ఆమె ఒంటిపై వెండి ఆభరణాలు, బంగారు చెవిదుద్దులు తీసుకుని పరారయ్యాడు.


భర్త అదే రోజు రాత్రి నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. మహిళ అదృశ్యం కింద కేసు నమోదు అయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీతో పాటు సాంకేతికతను వినియోగించిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 60తులాల వెండి ఆభరణాలు, 5గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం గోల్కొండ పోలీసులకు నిందితుడిని అప్పగించినట్లు సీపీ వెల్లడించారు.

Updated Date - 2021-06-17T14:24:23+05:30 IST