హైదరాబాద్‌ x బెంగళూరు

ABN , First Publish Date - 2022-04-05T08:13:40+05:30 IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అన్నారు.

హైదరాబాద్‌ x బెంగళూరు

  • కేటీఆర్‌, డీకే శివకుమార్‌ మధ్య ట్విటర్‌ వార్‌
  • 2023లో కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుస్తుంది
  • బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తాం: డీకే
  • హైదరాబాద్‌-బెంగళూరు మధ్య
  • ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిద్దాం
  • ఇన్‌ఫ్రా, ఐటీ/బీటీ పై దృష్టి పెడదాం
  • హలాల్‌, హిజాబ్‌పై కాదు: కేటీఆర్‌
  • స్టార్ట్‌పలపై కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు
  • కర్ణాటక మంత్రి సీఎన్‌ అశ్వత్‌నారాయణ్‌


హైదరాబాద్‌/బెంగళూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అన్నారు. బెంగళూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, విద్యుత్తు కోతలు, నీటి సరఫరా సమస్యలూ ఉన్నాయని ‘ఖాతాబుక్‌’ స్టార్టప్‌ సంస్థ సీఈవో రవీశ్‌ నరేశ్‌ ఇటీవల ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలాగే కొనసాగితే వలసలు ప్రారంభమవుతాయని ‘సేతు ఏపీఐ’ స్టార్టప్‌ మేనేజర్‌ నిఖిల్‌ కుమార్‌ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, బ్యాగులు సర్దుకుని చేసుకుని రావాలని బెంగళూరులోని స్టార్టప్‌ సంస్థలకు కేటీఆర్‌ సూచించారు. దీనిపైనే సోమవారం డీకే శివకుమార్‌ స్పందించారు. ‘మిత్రుడు కేటీఆర్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నాను. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుంది. బెంగళూరును దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్ది, నగర కీర్తిని పునరుద్ధరిస్తాం’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై   సోమవారం కేటీఆర్‌ స్పందించారు.


 ‘డియర్‌ శివకుమార్‌ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు.. అలాగే అక్కడ ఎవరు గెలుస్తారో తెలియదు.. కానీ, సవాలును స్వీకరిస్తున్నాను. మన యువతకు ఉద్యోగాలు సృష్టించడానికి, మన దేశ శ్రేయస్సుకు సహకరించడం కోసం హైదరాబాద్‌, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిద్దాం. ఇన్‌ఫ్రా, ఐటీ/బయో-టెక్‌పై దృష్టి పెడదాం. అంతేగానీ, హలాల్‌, హిజాబ్‌పై కాదు’ అని బదులిచ్చారు. కాగా, బెంగళూరు నుంచి స్టార్టప్‌ సంస్థలు హైదరాబాద్‌కు రావాలని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కర్ణాటక ఐటీ/బయో-టెక్‌ మంత్రి సీఎన్‌ అశ్వత్‌నారాయణ్‌ అన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి తీరును ప్రదర్శించడం సరికాదని చెప్పారు. ఆయన బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘బెంగళూరులో మౌలిక సదుపాయాల విషయంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఎటువంటి అంశాలపై అయినా పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భయం వద్దు.. లోపాలు ఉంటే సరిదిద్దుతాం’ అని అశ్వత్‌నారాయణ్‌ చెప్పారు. తమను బెదిరించే స్థాయికి ఎవరూ వెళ్లరాదన్నారు. పరిశ్రమలకు బెంగళూరులో ఉన్న మౌలిక సదుపాయాలు, తగిన వాతావరణం ఎక్కడా లేదని చెప్పారు. అందుకే ‘స్టార్ట్‌ప’ల రాజఽధాని అయిందన్నారు.


పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ పెంచలేదు 

తెలంగాణ ప్రభుత్వం గత ఏడేళ్లుగా పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ పెంచలేదని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వివక్షపూరిత సెస్‌ కారణంగా పెట్రోల్‌ ధరలు భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం దాన్ని తగ్గిస్తే కనీసం 30 శాతం పెట్రోలియం ధరలు తగ్గుతాయని ఆయన చెప్పారు. గత 14 రోజుల్లో 12 సార్లు కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచిందని అన్నారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ జరగడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-05T08:13:40+05:30 IST