రేసులోకి హైదరాబాద్‌!

ABN , First Publish Date - 2021-03-03T09:28:02+05:30 IST

ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ను కచ్చితంగా భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇటీవలే ప్రాథమికంగా ముంబైతో కూడిన ఆరు వేదికలను కూడా ఖరారు చేసింది...

రేసులోకి హైదరాబాద్‌!

  • ముంబైపై వెనక్కి 
  • కరోనా ఉధృతే కారణం
  • ఐపీఎల్‌ వేదికపై పునరాలోచన

ముంబై: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ను కచ్చితంగా భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇటీవలే ప్రాథమికంగా ముంబైతో కూడిన ఆరు వేదికలను కూడా ఖరారు చేసింది. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో బోర్డు పునరాలోచనలో పడింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం ఈ రాష్ట్రంలోనే వెలుగు చూస్తుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కారణంగా ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడ మ్యాచ్‌లు జరగకపోవచ్చని సమాచారం. అదే జరిగితే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు తమ సొంత మైదానంలో ఆడే అవకాశం కోల్పోయినట్టే. వాస్తవానికి లీగ్‌ మ్యాచ్‌లను ముంబై, పుణెలలో జరిపించి నాకౌట్‌ దశను అహ్మదాబాద్‌లో పూర్తి చేయాలని గతంలో భావించారు. 


హైదరాబాద్‌కు చాన్స్‌!

గత వారం బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌, తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమిన్‌, ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ కలిసి వేదికలపై చర్చించారు. అనంతరం చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. ముంబైలో కేసులున్నా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లను జరిపించేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించినట్టు వార్తలు వినిపించాయి. అయితే వేదికల్లో హైదరాబాద్‌ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం ఉప్పల్‌లో మ్యాచ్‌లను జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలు లేకపోవడంతో పాటు కరోనా కేసులు కూడా అత్యల్పంగా ఉన్నాయని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కూడా గుర్తుచేసింది. అయితే ఇప్పుడు ముంబైపై బోర్డు వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో హైదరాబాద్‌ను చేర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 





ఫ్రాంచైజీల అసంతృప్తి

వేదికల్లో మొహాలీ, జైపూర్‌లను విస్మరించడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు స్థానిక అనుకూలత లభించదనే ఆందోళన ఆయా జట్లు వ్యక్తం చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా మ్యాచ్‌లు జరిపేందుకు నిర్ణయించారని ఆరోపించాయి. అసలు ఏ ప్రాతిపదికన ఈ వేదికలను ఖరారు చేశారని ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌వాడియా బోర్డుకు లేఖ రాశాడు. అలాగే వ్యాపార పరంగానూ తమకు నష్టం చేకూరుతుందని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. దీనికి తోడు లీగ్‌ సమీపిస్తున్నా ఇంకా వేదికలు, షెడ్యూల్‌పై తుది నిర్ణయానికి రాకపోవడంపైనా అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు త్వరలోనే ఐపీఎల్‌ పాలకమండలి, బీసీసీఐ కలిసి అందరి సందేహాలను నివృత్తి చేస్తూ తుది నిర్ణయం తీసుకోనున్నాయి.


Updated Date - 2021-03-03T09:28:02+05:30 IST