సాదాబైనామాలకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2021-10-17T09:41:05+05:30 IST

రాష్ట్రం లో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అటకెక్కొనట్లేనా? అంటే రెవెన్యూ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది.

సాదాబైనామాలకు మోక్షమెప్పుడో?

  • జీవో జారీ అయ్యి రేపటికి ఏడాది..
  •  హైకోర్టు ఉత్తర్వులు పట్టని సర్కారు.. 
  • అభ్యంతరం లేని వాటిపైనా కాలయాపనే
  • 9.20 లక్షల మంది రైతుల నిరీక్షణ

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అటకెక్కొనట్లేనా? అంటే రెవెన్యూ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. దరఖాస్తులు స్వీకరించి ఈనెల 30 నాటికి ఏడాది పూర్తికావస్తున్నా.. కోర్టులో కేసుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులను పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.20లక్షల మంది రైతులు తమ ధరఖాస్తులకు మోక్షమెప్పుడోనని నిరీక్షిస్తున్నారు. తెల్ల కాగితం, స్టాంపు పేపర్లపై పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న ఒప్పందం ద్వారా కొనుగోలు చేసిన భూములను సాదాబైనామాలు అంటారు. సాదాబైనామాల ద్వారా కోనుగోలు చేసిన భూములే వివాదాలకు కారణమని భావించిన ప్రభుత్వం 2014 జూన్‌ 2 నాటికి తెల్లకాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు (పట్టణాల్లో అవకాశం లేదు) అవకాశమిచ్చింది. సుమారు 12లక్షల మంది రైతులు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి అర్హులైన రైతులకు 13-బీ ప్రొసీడింగ్స్‌ను జారీ చేయడంతో పాటు ఆర్డీవోల ద్వారా పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసింది. అయితే , రైతుల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం గతేడాది రెండుమార్లు (పట్టణాల్లో అవకాశం లేదు) క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చింది. అక్టోబరు 18 నుంచి నవంబరు 10 వరకు రెండు విడతల్లో మొత్తం 9.20లక్షల ధరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది.  


హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

2020 అక్టోబరు 30న ప్రభుత్వం నూతన ఆర్‌ఓఆర్‌ (రికార్డు ఆఫ్‌ రైట్‌) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నూతన చట్టం అమల్లోకి వచ్చిన తరువాత రద్దయిన ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం సాదాబైనామాల దరఖాస్తులను ఎలా స్వీకరిస్తారని... ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో రిట్‌ వేయడంతో అక్టోబరు 29 లోపు స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి 13-బీ పత్రాలను జారీ చేయవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత స్వీకరించిన ధరఖాస్తులను పక్కకు పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 


నాటి నుంచీ తాత్సారమే 

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం 2020 అక్టోబరు 29 వరకు స్వీకరించిన 2.20లక్షల దరఖాస్తులను పాత ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం పరిష్కరించడానికి ఎలాంటి అభ్యంతరం లేకున్నా ప్రభుత్వం ఈ విషయంలో కాలయాపన చేస్తోంది. పాత ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం అక్టోబరు 29 లోపు స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. తహసీల్దార్లు అర్హులైన రైతులకు 13-బీ ప్రొసీడింగ్‌ను జారీ చేయొచ్చు. ఈ ప్రొసీడింగ్‌ ఆధారంగా రైతులు తమ భూములను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ఆర్డీవో ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ నేటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


నూతన చట్టంలో సవరణ చేస్తేనే...

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులు పూర్తిగా కలెక్టర్‌ పరిధిలో ఉంటాయి. సాదాబైనామాల దరఖాస్తులపై కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి 13-బీ పత్రాల జారీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. వారి ఆదేశానుసారం తాహసీల్దార్లు అర్హులైన రైతులకు 13-బీ పత్రాలను జారీ చేయాలి. కలెక్టర్‌ల బిజీ షెడ్యూల్‌ ప్రకారం ఇది అసాధ్యమని  రెవెన్యూ చట్టాల నిపుణులు, సీనియర్‌ రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ.. అసెంబ్లీ ఆమోదంతో నూతన ఆర్‌ఓఆర్‌లో సవరణలు చేసి కలెక్టర్ల పర్యవేక్షణలో 13-బీ పత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు ఇస్తే సాదాబైనామాలకు మోక్షం లభిస్తుందని వారంటున్నారు. 

Updated Date - 2021-10-17T09:41:05+05:30 IST