Abn logo
Sep 25 2021 @ 00:35AM

వేపాడలో హైడ్రామా!

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు



అధిష్టానం నిర్ణయించింది ఒకరిని..

వైసీపీ సభ్యులు ఎన్నుకున్నది మరొకరిని..

ఎమ్మెల్యే కడుబండికి చుక్కెదురు

ఆందోళనలతో దద్దరిల్లిన ఎంపీడీవో కార్యాలయం

వేపాడ సెప్టెంబరు 24 : ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వేపాడలో శుక్రవారం రోజంతా హైడ్రామా నడిచింది. నాటకీయ పరిణామాల నడుమ దొగ్గ సత్యవంతుడు ఎంపీపీగా, అడపా ఈశ్వరరావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకుగాను అక్కడ 12 చోట్ల వైసీపీ, రెండు చోట్ల టీడీపీ గెలుపొందాయి. ఎంపీపీ అభ్యర్థిగా వేచలపు వెంకటచినరామునాయుడును అధిష్టానంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఖరారు చేశారు.  ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమ్మపల్లి ఎంపీటీసీ సభ్యుడు దొగ్గ సత్యవంతుడుతో తనతో పాటు మరో ఆరుగురు సభ్యులను ఫలితాలు వెలువడిన తరువాత ప్రత్యేక శిబిరంలోకి తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే కడుబండి, జిల్లా పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులు మంతనాలు చేసినా ఆయన వినలేదు. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు నేరుగా సత్యవంతుడు తనను బలపరుస్తున్న సభ్యులతో మండల కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడుబండి హుటాహుటిన వేపాడ చేరుకున్నారు. వెంకటచినరామునాయుడు ఎంపీపీగా ఎన్నిక కావడానికి శతవిధాలా ప్రయత్నించారు. చినరామునాయుడుకు నలుగురు వైసీపీ, ఇద్దరు టీడీపీ సభ్యుల మద్దతు ఉన్నట్టు చూపారు. కానీ బొద్దాం ఎంపీటీసీ సభ్యురాలు పిల్లా లక్ష్మి సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్యే కడుబండి, వైసీపీ నేత ఇందుకూరి రఘురాజు వాహనంలో ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం చేయగా..సత్యవంతుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక వర్గం నినాదాలు చేయగా...ఎన్నికలు నిలిపివేయాలని మరో వర్గం పట్టుపట్టింది. కొంతమంది కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పరిస్థితి చేయి దాటుతున్న తరుణంలో ఏఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ అనిల్‌కుమార్‌ సిబ్బందితో  మోహరించారు. ఆందోళనకారులను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. వైసీపీ అధిష్టానం విప్‌ జారీచేసినా ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎంపీపీగా సత్యవంతుడు, ఉపాధ్యక్షుడిగా ఈశ్వరరావును ఎన్నుకున్నారు. వారికి ఎన్నికల అధికారి లక్ష్మీనరసింహ ధ్రువపత్రాలు అందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాము ఎన్నికలు నిర్వహించామని ఆయన చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.