ఆద్యంతం హైడ్రామా...!

ABN , First Publish Date - 2021-06-20T05:12:33+05:30 IST

మావోయిస్టుల మృతదేహాల తరలింపు నుంచి పోస్టుమార్టం వరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వద్ద పెద్ద హైడ్రామా నడిచింది.

ఆద్యంతం హైడ్రామా...!
మావోయిస్టు మృతదేహానికి ఎక్స్‌రే తీసి ప్రాంతీయ ఆస్పత్రి నుంచి తీసుకొస్తున్న దృశ్యం(ఫైల్‌ ఫొటో)

  నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

 మూడు మృతదేహాలు బంధువులకు అప్పగింత 

 మార్చురీలో మిగిలిన మూడు భద్రం

నర్సీపట్నం, జూన్‌ 19: మావోయిస్టుల మృతదేహాల తరలింపు నుంచి పోస్టుమార్టం వరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట సమీప అటవీ ప్రాంతంలో ఈ నెల 16వ తేదీన జరిగిన ఎదురుకాల్పుల్లో డీసీఎంలు సందె గంగన్న అలియాస్‌ అశోక్‌, రణదేవ్‌, ఏసీఎం సంతునాచిక, దళ సభ్యురాలు పైకే, లలిత, మరో మహిళా మావోయిస్టు మృతిచెందారని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌కౌంటర్‌ ఉదయం జరిగితే 40 గంటల తర్వాత అంటే గురువారం సాయంత్రం 5.35 గంటలకు మృతదేహాలను నర్సీపట్నం తీసుకువచ్చారు. మృతదేహాలను వ్యాన్‌ నుంచి దించిన తర్వాత పాత్రికేయులు ఫొటోలు తీసుకోవడానికి అవకాశం ఇస్తామని పోలీసులు మొదట చెప్పారు. దీంతో ఎలకా్ట్రనిక్‌, ప్రింట్‌ మీడియా ప్రతినిధులు సాయంత్రం నుంచి రాత్రి ఎని మిది గంటల వరకు ఆస్పత్రి వద్ద పడిగాపులు కాచారు. మృతదేహాలన్నింటినీ శుభ్రం చేసి ఫ్రీజర్లలో పెట్టిన తర్వాత ఫొటోలు, వీడియో తీసుకోవడానికి మీడియాను అనుమతించారు. వివరాలు తెలియజేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను కోరితే..శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తిచేసిన తర్వాత మాట్లాడతామని చెప్పారు.


ఇతరులకు ప్రవేశం లేదు...

శుక్రవారం ఉదయం ఆస్పత్రి ఎమర్జన్సీ విభాగం వద్ద సాయుధ పోలీసులను కాపలా ఉంచారు. పోలీసులు మినహా ఇతరులను లోపలకు అనుమతించలేదు.  శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తిచేసి ఆరు మృతదేహాల్లో మూడు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే ఈ విషయమై శనివారం సాయంత్రం వరకు పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల్లో ఐదుగురు పేర్లు మాత్రమే పోలీసులు ప్రకటించారు. ఆరో మావోయిస్టు (మహిళా మావోయిస్టు) పేరు ప్రకటించలేదు. భారత కమ్యూనిస్టు పార్టీ (పార్టీ మావోయిస్టు) ఆంధ్ర- ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ గణేశ్‌ పేరుతో విడుదలైన లేఖలో ఆ మహి ళా మావోయిస్టు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం గోర్నాం కు చెందిన మడకం చైతే అని పేర్కొన్నారు. 

 

మార్చురీలో మూడు మృతదేహాలు

గంగన్న మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఆయన తమ్ముడు మహేంద్ర తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా గుంపుల గ్రామం నుంచి నర్సీపట్నం వచ్చారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఆయనకు మృతదేహాన్ని అప్పగించారు. తర్వాత రణదేవ్‌, లలిత మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలు ప్రాంతీయ ఆస్పత్రి మార్చురీలో ఉన్నాయి. 

 

బూటకపు ఎన్‌కౌంటర్‌ : గంగన్న సోదరుడి ఆరోపణ

తీగలమెట్ట ఆటవీ ప్రాంతంలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మృతుడు సందె గంగన్న సోదరుడు మహేంద్ర ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం గంగన్న మృతదేహంతో తిరుగు ప్రయాణమైన ఆయన ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తన సోద రుడు గంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. పోలీసులు మృతదేహం మొత్తం చూపించ లేదని, ముఖం మాత్రమే చూపించారన్నారు. 

Updated Date - 2021-06-20T05:12:33+05:30 IST