కేటీపీఎస్‌లో హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌

ABN , First Publish Date - 2020-08-11T09:21:49+05:30 IST

పాల్వంచ కేటీపీఎస్‌లో భారీ ప్రమాదం తప్పింది. విద్యుదుత్పత్తి యూనిట్‌లో జనరేటర్‌ తిరగడానికి అసవరమయ్యే హైడ్రోజన్‌ గ్యాస్‌ స్వల్ప మొత్తంలో లీక్‌ కాగా..

కేటీపీఎస్‌లో  హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌

ఎగ్జిట్‌ వాల్వ్‌లు తెరవడంతో తప్పిన ప్రమాదం

పాల్వంచ, ఆగస్టు 10 : పాల్వంచ కేటీపీఎస్‌లో భారీ ప్రమాదం తప్పింది. విద్యుదుత్పత్తి యూనిట్‌లో జనరేటర్‌ తిరగడానికి అసవరమయ్యే హైడ్రోజన్‌ గ్యాస్‌ స్వల్ప మొత్తంలో లీక్‌ కాగా.. అక్కడే ఉన్న ఇంజనీర్లు చాకచక్యంగా వ్యవహరించారు. ఎగ్జిట్‌ వాల్వ్‌లను తెరిచి ప్రమాదాన్ని నిలువరించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(కేటీపీఎ్‌స) ఐదో దశ కర్మాగారం తొమ్మిదో యూనిట్‌(250 మెగావాట్లు)లో 2 నెలలుగా వార్షిక మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ట్రయల్‌రన్‌లో భాగంగా బాయిలర్‌, టర్బైన్లను విజయవంతంగా లైటప్‌ చేశారు. యూనిట్‌కు గుండెకాయలా పని చేసే జనరేటర్‌లో సోమవారం హైడ్రోజన్‌ గ్యాస్‌(హెచ్‌2)ను నింపుతుండగా... సిలిండర్‌ కింది భాగంలోని పైపుల్లోంచి లీకవుతుండడాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న కార్మికులు బయటకు పరుగులు తీయగా.. అదే విభాగంలో ఉన్న 10 మంది ఇంజనీర్లు చాకచక్యంగా వ్యవహరించారు. గ్యాస్‌ నింపే ప్రక్రియను నిలిపివేసి 250 మీటర్ల ఎత్తులో ఉండే పైపుల వాల్వ్‌లను తెరిచారు. గాలిలో హైడ్రోజన్‌ గ్యాస్‌ నేరుగా కలిసినా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో.. దానికి సమాంతరంగా కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న కేటీపీఎస్‌ 5, 6 దశల సీఈ రవీందర్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సైతం ఘటనపై ఆరా తీశారు. వెంటనే స్పందించిన ఏఈ, ఏడీఈలను ప్రశంసించారు.

Updated Date - 2020-08-11T09:21:49+05:30 IST