అన్ని కథల్లో నేనున్నాను, కానీ ఏ కథా నా కథ కాదు.

ABN , First Publish Date - 2020-09-07T06:34:00+05:30 IST

ఇటీవల వస్తున్న కథలు చదువుతున్నాను. వస్తు వైవిధ్యం పెరిగింది. ఆయా సమూహాల గురించి వారి వారి తాత్వికతను బలపరచుకోవడానికి రాసినట్టుంటున్నాయి....

అన్ని కథల్లో నేనున్నాను, కానీ ఏ కథా నా కథ కాదు.

పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే అవసరం లేని రచయిత్రి చాగంటి తులసి. తండ్రి చాటు మొక్కలా మిగిలిపోకుండా సాహితీవనంలో స్వీయ పరిమళంతో తరువై వెలసింది. కల్పనా సాహిత్యం, అనువాదం, విమర్శ, పుస్తక ప్రచురణ, సాహితీ సంస్థ నిర్వహణ ఇలా శాఖోపశాఖలుగా విస్తరించింది ఆమె సృజన. ఎప్పటికప్పుడు కొత్త తరంతో తనను తాను అప్డేట్‌ చేసుకునే నవీన. పక పకల పసినవ్వులతో నైరాశ్యాన్ని దరిచేరనివ్వని సతత హరిత. వక్త, అధ్యాపకురాలు, వ్యక్తుల పట్ల స్థాయీ భేదాలు చూపని సమదర్శి. నిక్కమైన మంచి నిక్కచ్చి మనిషి. మాటలతో ఆటలాడే ఈ ఎనభై వసంతాల నవజవ్వనితో మాట్లాట.


ఇటీవల వస్తున్న కథలు చదువుతున్నాను. వస్తు వైవిధ్యం పెరిగింది. ఆయా సమూహాల గురించి వారి వారి తాత్వికతను బలపరచుకోవడానికి రాసినట్టుంటున్నాయి. బతుకులోంచి వచ్చినవి కాక, మెదడులోంచి వచ్చినవి. ఎక్కువకెక్కువ మాన్యుఫ్యాక్చర్డ్‌ స్టోరీస్‌గా వస్తున్నాయి.


‘‘పెద్దై అది ఏమవుతుందో చూద్దాం’’ అనే వాడు చాసో. ‘ఎంపు’ కథ చదివాక... ‘‘నాన్నా! కుంటివాణ్ణి చేసుకోనా? గుడ్డివాణ్ణి చేసుకోనా’’ అని అడిగాను. ఎంతమంది అమ్మాయిలు తండ్రిని అలా అడగ్గలరు? అలా అడగ్గలిగే ఆరోగ్యకరమైన వాతావరణం ఎన్ని కుటుంబాల్లో ఉంటుది? ప్రొగ్రెసివ్‌ అనుకున్న చాలామంది, ఆడపిల్లల విషయంలో మామూలుగా ఆలోచించేవారే ఎక్కువ. అందుకే చాసో డిఫరెంట్‌, కమిటెడ్‌. ఆయన రాత చేతలు వేరు వేరు కావు.


చాసో కూతురుగా పుట్టడం అదృష్టమా యాదృచ్ఛికమా?

యాదృచ్ఛికమే! అయితే వ్యక్తిత్వంతో నన్ను నన్నుగా తీర్చి దిద్ది ‘‘మనిషి’’గా పెరగడానికి దోహదపడ్డాది. చాసో ఆయన మిత్రుల మధ్యా నా పెరకువకు గట్టి పునాదిని వేసింది. సారవంతమైన జీవితానికి దారి తీయించింది.


చాసో హవేళీ మీ సృజనకు ప్రేరణ నిచ్చిందా?

అందులో సందేహం లేదు. ఊహల అల్లికకు, మంచి చెడ్డల అవగాహనకు, వెలుగు చీకట్ల ఎరుకకు, మనుషుల ప్రవర్తన వెనుక పనిచేసే సామాజిక, ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులతో గట్టిపడ్డ వ్యవస్థ గురించిన తెలివిడి, చూపును ఇచ్చింది. చాసో హవేళీ సాహితీవేత్తల కళాకారుల నిలయం. నాతోపాటు దాని వల్ల ప్రేరణ పొందినవారు చాలామంది ఉన్నారు.


చాసో ప్రోత్సహించడం, నేర్పడం చేసేవాళ్ళా?

చాసో దృష్టిలో ప్రోత్సహించడం అంటే, భేష్‌ బాగున్నాయనేసి పెడదారి పట్టించడం కాదు. అందుకే నారాయణ బాబుతో దెబ్బలాడేవాడు. జ్ఞానాన్ని కలగజెయ్యాలి కానీ అజ్ఞానాన్ని పెంచకూడదు. తానో గొప్ప రచయితననే అహంభావం పెరిగే టట్లు ప్రోత్సాహం ఉండకూడదనే వాడు. చాసో నేర్పుతు న్నట్టు నేర్పించనూ లేదు, నేర్చుకుంటున్న స్పృహతో నేను నేర్చుకోనూ లేదు. ఆ వాతావరణ ప్రభావంతో నేను రాయాలని సరదాపడ్డాను. నారాయణబాబు నా సరదాకి దోహదపడ్డాడు. నేను రాసిన కథని మద్రాసు వెళ్లినప్పుడు స్వయంగా ‘బాల’ పత్రికకి ఇచ్చాడు. నాన్నకి చెప్పొద్దన్నాడు. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. రాసిన కథ పేరు భరతపక్షి.


చాసోలాగే- రాసి కన్నా వాసికే ప్రాధాన్యత ఇచ్చారు, చాలా ప్రక్రియలు చేపట్టారుగానీ దేనిలోనూ కంటిన్యూ కాలేదు, కారణం?

రాయడం కోసమే నేను రాయలేదు, రాయాలనిపించినప్పుడే రాశాను. అది ఏ ప్రక్రియలో, ఏ మేరకు రాస్తే బాగుంటుందో, అంతవరకే రాశాను. నా వాళ్ళు ఇది చదివితే బాగుంటుంది అనిపిస్తే దాన్ని తెలుగులోకి చేశాను. ఎంత ‘పెద్ద’ వాళ్ళు అడిగినా నాకు నచ్చితేనే అనువాదం చేయడం, లేకపోతే లేదు. రచనా వ్యాసంగం నాకు కెరియర్‌ కాదు.


ూమీకు ఇష్టమైన రచయిత ఎవరు?

రచన బాగున్నంతవరకే ఏ రచయితనైనా ఇష్టపడ్డం. అంతే తప్ప ఆ రచయిత ఏది రాసినా ఈగ వాలనివ్వని అభిమానం నాకు ఉండదు. అలా ఉండకూడదు కూడా. ఆ రచయిత మీద గౌరవం ఉండడం, ఉండకపోవడం అతని వ్యక్తిత్వానికి సంబం ధించిన విషయం. దానిని బట్టి నా అభిప్రాయం ఉంటుంది.


కథకుడుగా చాసో తర్వాతే మీరెవరినైనా గుర్తిం చేది. చాసో పట్ల అంత పొసెసివ్‌గా ఎందుకుంటారు? మీరు ప్రమోట్‌ చేయాల్సిన పరిస్థితా చాసోది?

వ్యక్తిగా, రచయితగా చాసోలో నేను చూసిన కోణం వేరు. అది లోకం చూడని కోణం, చూడలేని కోణం. దానిని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వచ్చానని అనుకుంటున్నాను. చాసోని ప్రమోట్‌ చేయడం అన్నమాటే హాస్యాస్పదం.


దేవుడు పట్ల మీ అభిప్రాయం ఏమిటి?

కుటుంబం, మన చుట్టూ ఉండే సమాజం గుడ్డి నమ్మకాలను, లేనిపోని భయాలను నింపుతాయి. తర్కంతో, యవ్వనంలో ఉడుకు రక్తంతో వాటిని కాదన్నా ఎక్కడో మెదడు లోతుల్లో అవి పేరుకొని ఉంటాయి. బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలి నప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. ‘‘నాకు నేనే ఆసరా, నాకు నేనే బలం’’ అనుకుంటే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమ వుతుంది. మనో దౌర్బల్యంలోంచే దేవుళ్ళూ దెయ్యాలూ పుడ తారు, పెరుగుతారు. అక్కడితో ఆగకుండా వారి తాబేదార్లు దళారులు తామర తంపరగా విస్తరిస్తారు. భక్తిని మాంచి లాభసాటి వ్యాపారం చేస్తారు. 


‘యాష్‌ ట్రే’ కథలో మీరున్నారా?

ఆ కథ లోనే కాదు, అన్ని కథల్లో నేనున్నాను కానీ ఏ కథా నా కథ కాదు. రచయిత అనుభవంలోంచి, ఇతరుల అను భవంలోంచి గ్రహించి ఒక కాల్పనిక పాత్ర సృష్టించుకుని వాస్తవమైనదానిగా కనిపించేటట్టు రచన చేయడం జరుగు తుంది. కథని ఉత్తమ పురుషలో చెప్పడం వల్ల, నేను పెళ్లి చేసుకోనందువల్ల అలా పొరబడే అవకాశం ఉంది. 


మీకు పెళ్లి ఎందుకు జరగలేదు? మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? - ఇందులో సరైన ప్రశ్న ఏది?

రెండోదే! మొదటి దాంట్లో స్త్రీ పరాధీనత, రెండో దాంట్లో స్వీయ నిర్ణయాధికారం ఉన్నాయి. ఒక వయసు వచ్చాక ఆడపిల్లకి పెళ్లి ప్రయ త్నాలు చేస్తారు. అది తల్లిదండ్రులు బాధ్యతగా భావిస్తారు. అంతవరకు తప్పు లేదు. కానీ తప్పనిసరిగా చేసి తీరాలన్న దానితోనే పేచీ. నా విషయంలోనూ అంతే. చూశారు నాకు నచ్చలేదు, ఊరుకున్నారు. ఆడపిల్ల పెళ్లి కోసమే పుట్టినట్టు, అది కాకపోతే తన బతుక్కి సార్థ కతలేదన్నట్టు చేసింది సమాజం. పెళ్లి అనివార్యమనుకున్నప్పుడే ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఆమె అభి ప్రాయంతో సంబంధం లేకుండానే ఏదో ఒకటి ముడిపెట్టేస్తారు. అక్కడితో ఆమె బతుకు అయిపోతుంది.  


‘‘పెద్దై అది ఏమవుతుందో చూద్దాం’’ అనేవాడు చాసో. ‘ఎంపు’ కథ చదివాక... ‘‘నాన్నా! కుంటివాణ్ణి చేసు కోనా? గుడ్డివాణ్ణి చేసుకోనా’’ అని అడిగాను. ఎంత మంది అమ్మాయిలు తండ్రిని అలా అడగ్గలరు? అలా అడగ్గలిగే ఆరోగ్యకరమైన వాతావరణం ఎన్ని కుటుంబాల్లో ఉంటుది? ప్రొగ్రెసివ్‌ అనుకున్న చాలామంది, ఆడపిల్లల విషయంలో మామూలుగా ఆలోచించేవారే. అందుకే చాసో డిఫరెంట్‌, కమిటెడ్‌. ఆయన రాత చేతలు వేరు వేరు కావు.


మీరు రాసిన వ్యాసాలన్నీ ఈ మధ్య ‘రంగంటే ఇష్టం’ పేరుతో వచ్చాయి. అందులో మీరు కాళీపట్నం ‘యజ్ఞం’ కథ పతాక సన్ని వేశం అసహజ చిత్రీకరణ అన్నారు. అంత సీనియర్‌ కథకుడికి సన్నివేశ ప్రవేశం తెలియదనడం సమంజసమా? 

తెలుగులో విమర్శ ఎదగకపోవడానికి ఈ ధోరణే ఉదాహరణ. విషయం ముఖ్యం కాని వ్యక్తులు కాదు. కాళీపట్నం ‘యజ్ఞ’మే కాదు, రావిశాస్త్రి రచనా విధానం మీద కూడా నా అభ్యం తరం వ్యక్తం చేశాను. రచయిత లౌల్యానికి లోను కాకూడదు.


చాసో స్ఫూర్తి ప్రారంభం, ఆపివేయటం గురించి?

చాసో స్ఫూర్తి ప్రారంభించిన తరువాత తొలిమూడు సభలూ ఒకరకంగా జరిగాయి. ఆ తర్వాత పద్ధతి మారింది. ముఖ్యంగా ఆర్థిక విషయంలో స్వశక్తితో నడపాలని నిర్ణయానికొచ్చాను. వేదిక మీద ఎంతమంది ఉండాలి? ఎవరేం మాట్లాడాలి? ఎంతసేపు మాట్లాడాలి?- అనే విషయం మీద నాకు కచ్చిత మైన అభిప్రాయం ఉండేది. సభను ఎలా చేయాలో చాసో స్ఫూర్తి ద్వారా వరవడి పెట్టాలనుకున్నాం. పెట్టాం కూడా. వస్తు శిల్పాలు సరిసమానమనీ, బతుకు లోంచి రాయాలనీ, ఆపాదించి కాదనే అంశాన్ని విశదపరిచే ప్రయత్నం చేశాం.  


ఏ ఉద్దేశాలతో, లక్ష్యాలతో సంస్థను నడిపామో, అలా నడపడానికి కేంద్ర స్థానంలో ఉన్న నేను కార్యభారాన్ని వహించే స్థితిలో లేని కారణంగా నిలిపివేయాలని నిర్ణయిం చాను. మిత్రులతో కలిసి ఆ విషయాన్ని ప్రకటించాను. ఎంతో కొంత అనుకున్న మంచి జరిగిందనే అనుకొంటున్నాను.


ఇప్పుడు వస్తున్న కథల మీద మీ అభిప్రాయం?

ఇటీవల వస్తున్న కథలు చదువుతున్నాను. వస్తు వైవిధ్యం పెరిగింది. ఆయా సమూహాల గురించి వారి వారి తాత్వి కతను బలపరచుకోవడానికి రాసినట్టుంటున్నాయి. బతుకు లోంచి వచ్చినవికాక, మెదడులోంచి వచ్చినవి. ఎక్కువకెక్కువ మాన్యుఫ్యాక్చర్డ్‌ స్టోరీస్‌గా వస్తున్నాయి.

ఇంటర్వ్యూ: జి.ఎస్‌. చలం

94901 06390

Updated Date - 2020-09-07T06:34:00+05:30 IST