Abn logo
Oct 19 2020 @ 00:48AM

నాకిక్కడేం బాగోలేదురా

నాకిక్కడేం బాగోలేదు నాన్నా

పరుగెత్తడం మరచిపోయిన నదిలా 

ఇలా పడి ఉండటం నచ్చడం లేదు 

ఈ చలిపిడిబాకులశయ్య మీద 

ఏమాత్రం కునుకు తియ్యలేకపోతున్నానే తల్లీ 

నా చివరల్ని నేను సులువుగానే దాటేశాను గానీ 

మీ చివరి స్పర్శ లేకుండా 

దిగ్రేఖ దాటి అడుగేయలేనని 

ఆత్మంతా ఎదురుచూపై తచ్చాడుకుంటోంది


అలలా ప్రవహించడం నేర్చుకుని 

మీరు లోకంలోకి నడిచిపోయినప్పటి నుంచి 

గెడపెట్టిన తలుపుల్లోపల్లో... నాలోపల్లోపల్లో..

నేను మొలకలెత్తిందీ లేదు 

ఊపిరి మెతుకు ముట్టిన నిమిషమూ లేదు నాన్నా

లాలనను చీదరించుకునేంతగా పెద్దోళ్ళై

మీరు ముందుముందుకెళుతుంటే 

నేను వెనకెనక్కి నడుస్తూ 

మీ నవ్వుల రాశుల్నేరుకోలేని పేదరికంలో 

ఎంతగా ప్రవాసినై

ఎన్ని వసంతాల మీద వెక్కిళ్లుగా అరిగిపోయానో 

మీరొచ్చినప్పుడెప్పుడైనా... ఒక్కసారైనా...

తడిమి తడిమి చదువుకోకపోతారా అని 

పసిపాపడిలా పెనవేసుకునే 

వాక్యం కావడానికి 

నన్నెన్ని మార్లు తిరగరాసుకున్నానో తల్లీ 


ఏరుతో చుట్టరికాన్ని నెమరేసుకుంటూ 

మీ కోసం ఇన్నేళ్లూ 

ఇంటి గడపలా కాచుక్కూచ్చున్నా 

ఈ రెండ్రోజులూ ఎదురుచూడలేననుకున్నారో ఏమో

నన్నిక్కడ ఈ ఇరుకిరుకు మంచులోయలో 

చచ్చినట్టు పడుండమంటున్నారు 

నాతో ముగిసిన యుద్ధాన్నింకా చేయిస్తున్నారు


కడమాపున కడగొట్టు గదిలో - అన్నేళ్లూ -

జారిపడటం మరిచిన చినుకులా వేలాడినా 

ఈ చలి నెగడులో రెండ్రోజులు 

రెండు జీవితకాలాల యాతనై 

చివరి నిద్ర కూడా కలతనిద్దరై 

కలవరపెడుతోందే తల్లీ 


నాన్నా... తల్లీ... 

ఇక నా గోల లేకుండా - మీకోసం -

అంబారీలను సిద్ధం చేసుకురమ్మని 

రేపటికి చెప్పేశాలేగానీ, 

తొరతొరగా వచ్చి 

నన్నీ దేహాల బందిఖానా నుంచి విడిపించండి 

విడిపించి మనింటికి తీసుకెళ్లండి 

మూతపడిన చూపులతోనే 

మనవాళ్లందర్నీ తృప్తితీరా తడుముకోనివ్వండి

ఇక ఏ జన్మకైనా మిమ్మల్ని చూస్తానో లేదో -

ఘనీభవించిన స్పర్శతోనే అయినా

కడసారి మిమ్మల్ని కడుపారా కావిలించుకోనివ్వండి 


ఈ ఒక్కసారి నాన్నా... ఇంకెప్పుడూ అడగనుగా 

అమ్మా, ఆఖరిసారి... ఈ ఒక్కసారి... 

నాలుగడుగులు నాతో నడిచొచ్చి 

దింపుడు కల్లం ఆశలొదిలిపెట్టి 

నన్నీ పొలిమేర దాటించండి 

ఈ నేల మీద నా సంతకాన్ని 

చివరికంటా చెరిపేసుకుని 

ఇకనుంచీ కొత్త భాషను కానివ్వండి!

ఇప్పటిదాకా ఎరుగని లోకంలో 

ఇంకో వేకువను వెదుక్కోనివ్వండి! 

యార్లగడ్డ రాఘవేంద్రరావు

99854 11099

Advertisement
Advertisement
Advertisement