నేను సీఎం అభ్యర్థినని చెప్పలేదు: ప్రియాంక

ABN , First Publish Date - 2022-01-22T18:49:41+05:30 IST

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ప్రకటించుకోలేదని, ఆ మాట తాను..

నేను సీఎం అభ్యర్థినని చెప్పలేదు: ప్రియాంక

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ప్రకటించుకోలేదని, ఆ మాట తాను చెప్పలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఇదే ప్రశ్న పదేపదే మీడియా అడుగుతుండటంతో ఒకింత అసహనంతో ''మీరు నా ముఖం ప్రతిచోట చూడవచ్చు'' అని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ఎన్నికల అనంతర బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా పొత్తులకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగితా శాతం ఎంత ఉందో మాట్లాడేందుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆమె ప్రశ్నించారు. విద్యపై బడ్జెట్‌లో ఎంత ఖర్చు చేశారనే విషయం చెప్పడానికి కూడా ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఆ కారణంగానే ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి చోటుచేసుకోవడం లేదని, ఆ సమస్యలపైనే తాము నిలదీస్తున్నామని ప్రియాంక చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 80 శాతం-20 శాతం అంటూ చెబుతున్నారని, నిజానికి అది 99 శాతం వెర్సన్ 1 శాతం అని ఆమె విశ్లేషించారు. యూపీతో సహా దేశంలో లబ్ధి పొందుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పెద్దపెద్ద వ్యాపారాలు నడుపుతున్న కొందరు ప్రభుత్వ మిత్రులు మాత్రమేనని, తక్కిన ప్రతి ఒక్కరూ బాధితులేనని ఆమె అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఒకే తరహా విధానాలు అనుసరిస్తున్నాయని ప్రియాంక విమర్శించారు. మతతత్వం, కులతత్వం ఎజెండాతోనే రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయని, పరస్పరం లబ్ధి చేకూర్చుకుంటున్నాయని అన్నారు.అమర్ జవాన్ జ్యోతిని నేషనల్ వార్‌ మెమోరియల్‌లో విలీనం చేయడంపై మాట్లాడుతూ, అమర్ జవాన్ జ్యోతిని ఎప్పటికీ ఆర్పకూడదని, దానిని గౌరవించాలని అన్నారు.

Updated Date - 2022-01-22T18:49:41+05:30 IST