తెలంగాణ ఏర్పాటుకు నేను విముఖం

ABN , First Publish Date - 2021-01-07T07:41:27+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను విముఖమని దివంగత మాజీ రాష్ట్రపతి, ఒకప్పటి కాంగ్రెస్‌ దిగ్గజం ప్రణబ్‌ ముఖర్జీ తన ఆత్మకథలో స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటుకు నేను విముఖం

  • నా చేతుల మీదుగా జరుగుతుందనుకోలేదు
  • విభజన వల్లే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ క్షీణత
  • ఆత్మకథలో ప్రణబ్‌ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు 
  • పార్టీని నడపడంలో సోనియా విఫలమని విమర్శ

  

న్యూఢిల్లీ, జనవ రి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను విముఖమని దివంగత మాజీ రాష్ట్రపతి, ఒకప్పటి కాంగ్రెస్‌ దిగ్గజం ప్రణబ్‌ ముఖర్జీ తన ఆత్మకథలో స్పష్టం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నేనైతే అంగీకరించేవాడిని కాదు..’ అని ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘మై ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌: 2012-2017’ పేరిట తాజాగా మార్కెట్‌ లో విడుదలైన ప్రణబ్‌ పుస్తకంలో తెలంగాణ ఏర్పాటు గురించి కీలక వ్యాఖ్యలున్నాయి. తనచేతుల మీదుగా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ విభజన జరుగుతుందనే విషయాన్ని తాను ఏ మాత్రం ఊహించలేకపోయానని ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.




తెలంగాణ ఆవిర్భావ దినానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి హోదాలో సంతకం చేసిన ప్రణబ్‌ ముఖర్జీ.... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడకపోగా, ప్రతికూల రాజకీయ వాతావరణం ఏర్పడిందని, పార్టీ పరిస్థితి క్షీణించిందని రాశారు. కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రె్‌సకు సంప్రదాయమైన, బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఓటమి చెందడం వల్లే అధికారానికి దూరమైందని ఆయన అభిప్రాయపడ్డారు.


తనను రాష్ట్రపతి భవన్‌కు పంపించిన తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయని, కీలక నిర్ణయాల్లో తడబాటు కనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని నడిపించడంలో సోనియా వైఫల్యం వెనుక అప్పటి పరిస్థితులు కారణమయ్యాయన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడుతుందని, బీజేపీ 195 నుంచి 200 స్థానాలతో ఏకైక అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేశానని ఆయన చెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా పరాజయం చెందడంతో దాని ప్రభావం ఫలితాలపై పడిందన్నారు. 




కాంగ్రెస్‌వి అవకాశవాద రాజకీయాలు: బీజేపీ


తెలంగాణ  ఏర్పాటు అంశంపై కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకథ పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటును తాను అంగీకరించేవాడిని కాదంటూ ప్రణబ్‌ ‘మై ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ అనే పుస్తకంలో రాశారని తెలిపారు.


తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రె స్‌కు ఆసక్తి లేద ని కృష్ణసాగర్‌రావు అన్నారు. బీజేపీ బేషరతుగా మద్దతు ఇచ్చి ఉండకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని స్పష్టం చేశారు. సోనియాను ‘తెలంగాణ అమ్మ’ అంటూ ప్రశంసించినందుకు కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సుష్మాస్వరాజ్‌ను మాత్రం ఆ పేరుతో పిలవచ్చని చెప్పారు. 


Updated Date - 2021-01-07T07:41:27+05:30 IST