Abn logo
Apr 14 2021 @ 00:00AM

మీ కోసమే వచ్చాను

తెల్లారుతుంది. బద్దకంగా బెడ్‌పై దొర్లుతుంటాడు అభి. పక్కనే ఉన్న ఫోన్‌ రింగవుతుంది. ‘గుడ్‌మార్నింగ్‌ అభి. క్లయింట్‌ను ఎప్పుడు కలుస్తావ్‌’ అడుగుతాడు బాస్‌. ఈ రోజు కలుస్తానని బదులిస్తాడు అభి. బెడ్‌ మీద నుంచి లేవగానే మళ్లీ ఫోన్‌... ‘ఏరా అభి... ఫ్రెష్‌ అయ్యి గుడికి వెళ్లు’ అని చెబుతుంది అతడి తల్లి. ‘ఈరోజు కుదరదమ్మా. చాలా వర్క్‌ ఉంది’. ‘ఇవాళ ఒక్క రోజే కదరా గుడికి వెళ్లేది’ అంటుంది ఆమె. ‘తరువాత ఎప్పుడైనా వెళతాను’ అంటూ ఫోన్‌ పెట్టేస్తాడు. క్లయింట్‌ దగ్గరికి బయలుదేరతాడు. ఈసారి ఫ్రెండ్‌ కాల్‌... ‘ఒరే... నా స్నేహితురాలు నీకు దగ్గర్లో ఉంది. ఆమెను స్టేషన్‌లో దింపాలి’. ‘ఇప్పటికే బాస్‌ కాల్‌ మీద కాల్‌ చేసి చంపేస్తున్నాడు. నేను అర్జెంట్‌గా క్లయింట్‌ను కలవాలి. ఇప్పుడు కుదరదు’ అంటాడు అభి. ‘కాదురా... దగ్గర్లో ఎవరూ లేరు. నువ్వే సాయం చేయాలి. ఒక్క అరగంటలో అయిపోతుంది కదా’ అని స్నేహితుడు రిక్వెస్ట్‌ చేస్తాడు. కాదనలేక సరేనంటాడు అభి. ఆమెకు కాల్‌ చేసి, లొకేషన్‌కు వెళతాడు. అతడిని చూడగానే తనను తాను పరిచయం చేసుకుంటుంది. ‘హాయ్‌... ఐయామ్‌ పల్లవి. మీరు అభి కదా. ఇఫ్‌ యూ డోన్ట్‌ మైండ్‌... ఆటోలో వెళదామా’ అని తను అడగగానే సరేనంటాడు అభి. పల్లవి ఏమీ తినకపోవడంతో తనను ముందు రెస్టారెంట్‌కు తీసుకువెళతాడు. తీరా వెళ్లాక ఏమీ తిననంటుంది తను. ‘ముందు గుడికి వెళ్లాలి’ అంటుంది పారు. ‘అలాగైతే ముందే చెప్పచ్చుగా’... విసుక్కుంటాడు అభి. ‘సారీ అండీ... ఏదో ఆలోచిస్తూ మరిచిపోయా’నంటుంది. ఇక తన వల్ల కాదని, క్లయింట్‌ను కలిసే టైమ్‌ అయిపోతుందన్న టెన్షన్‌లో అతను ఆమెను వదిలేసి వెళ్లిపోతానంటాడు. ఆమె సరేనంటుంది. 


అయితే మళ్లీ మనసు మార్చుకుని, వెనక్కు వస్తాడు. ‘చెప్పండి... ఎక్కడికి వెళదాం’ అడుగుతాడు. ‘చెప్పాను కదా... ముందు గుడికి వెళదాం’. ఆటో దొరక్క ఇద్దరూ నడిచి గుడికి వెళతారు. దేవుడికి దణ్ణం పెట్టుకుని తనలో తాను మాట్లాడుకొంటుంది పల్లవి... ‘ఒక ఎగ్జామ్‌ కోసం ఇంత దూరం వచ్చానా? గత నెలలో కన్న కలలా ఉంది... ఇలా రావడం... ఇలా మాట్లాడడం. మనసు ఒకచోటే ఉన్నా అందులో ఏముందో తెలుసుకోవాలని అస్సలు లేదు’. ‘ఎవరితో మాట్లాడుతున్నారు’... అభి అడుగుతాడు. ‘మీతోనే’ అంటుంది. ‘మీ మాటలు... మిమ్మల్ని చూస్తుంటే వదిలేసిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి’... అతడు ఏదో లోకంలోకి వెళతాడు. అక్కడి నుంచి బయలుదేరుతారు ఇద్దరూ. ‘పెళ్లెప్పుడు?’... అభిని అడుగుతుంది పల్లవి. సమాధానం చెప్పేలోపే ‘నన్ను చేసుకొంటారా’ అంటుంది. కాసేపటికి తేరుకుని... ‘మీ సెన్సాఫ్‌ హ్యూమర్‌కు హ్యాట్సాఫ్‌’ అంటూ ముందుకు సాగుతాడు అతడు. ‘మీ కోసమే వచ్చాను’ అని పల్లవి అంటే... ‘సరి సర్లే... రండి వెళదాం’ అంటాడు అభి. ‘చెబుతున్నా కదా... మీ కోసమే వచ్చానని’ బిగ్గరగా అరుస్తుంది తను. అప్పటికీ నమ్మలేకపోతాడు అభి. ‘ఎందుకండీ జోక్‌ చేస్తున్నారు? మనిద్దరం ఇంతకు ముందు ఎప్పుడూ కలవనే లేదు’ అంటే... ‘తెలిసి కూడా తెలియనట్టు నటించవద్దు’ అని కౌంటర్‌ ఇస్తుంది పల్లవి. ‘సర్లే... మరి ఇప్పుడు పరిచయం చేసుకొందామా’ అడుగుతుంది. ఆ తరువాత ఏమైందన్నది యూట్యూబ్‌లో విడుదలైన ‘పారు’ లఘుచిత్రంలో చూస్తేనే బాగుంటుంది. స్ర్కీన్‌పై రెండే పాత్రలు కదులుతున్నా... ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ అలా ఆహ్లాదంగా సాగిపోతుంటుంది. అభిగా రాజేష్‌ కన్నా, పల్లవిగా భవ్యా త్రిమూర్తులు పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. హరీష్‌ రచన, దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుంటాయి. యూట్యూబ్‌లో వేలమంది వీక్షించి, లైక్‌ చేశారు.