మనసేం బాలేదు!

ABN , First Publish Date - 2022-09-17T09:13:13+05:30 IST

కొవిడ్‌ అనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు గణనీయంగా పెరిగాయి. అవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటున్నాయి.

మనసేం బాలేదు!

  • ప్రతి నలుగురిలో ఒకరికి మానసిక అనారోగ్యం..
  •  కొవిడ్‌ తర్వాత పెరిగిన సమస్యలు
  • 70 శాతానికి పైగా రుగ్మతలు 25 ఏళ్లలోపే
  • 50 శాతం సమస్యలు 15 ఏళ్లలోపు పిల్లల్లో
  • అపోహలతో వైద్యం చేయించుకోని రోగులు
  • 9వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఆసియన్‌ సైకియాట్రీలో వక్తలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ అనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు గణనీయంగా పెరిగాయి. అవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటున్నాయి. ఆస్ట్రేలియాలో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి  సమస్యలు పెరిగితే, ఇండియాలో వీటితో పాటుగా అడిక్షన్స్‌ కూడా పెరిగాయి. తొలి దశలోనే మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి, చికిత్స అందిస్తే చాలా వరకూ సమస్యను అధిగమించవచ్చనే ‘9వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఆసియన్‌ సైకియాట్రి’లో పాల్గొన్న వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు మన దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సదస్సు జరుగుతోంది. వెస్టిన్‌ హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైన సదస్సులో 28 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సైక్రియాట్రిక్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న సదస్సుకు ఆశా హాస్పిటల్స్‌, ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ సైకియాట్రీ సహకారం అందిస్తున్నాయి.


మానసిక అనారోగ్యమంటే మానసిక వైకల్యం కాదు

సదస్సులో వరల్డ్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ అఫ్సర్‌ జావెద్‌ మాట్లాడుతూ కొవిడ్‌ తరువాత మానసిక ఆరోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మొదలైందన్నారు. మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స కంటే ముందుగా వాటి నివారణపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు. ‘మానసిక అనారోగ్యం అంటే మానసిక వైకల్యమనే భావనలోనే చాలామంది ఉన్నారు. ఆ అభిప్రాయం మారాలి. దురదృష్టవశాత్తు మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడం లేదు’ అని చెప్పారు. 70 శాతానికి పైగా మానసిక ఆరోగ్య సమస్యలు 25 ఏళ్లలోపు ప్రారంభమైతే, 50 శాతం సమస్యలు 15 ఏళ్లలోపు పిల్లల్లో కనబడుతున్నాయని చెప్పారు. 2019 అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 58 మిలియన్ల మంది పిల్లలు ఆందోళన సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. చిన్నారుల్లో ఈ సమస్యలను గుర్తించి, తగిన చికిత్స అందించాలని సూచించారు. వైద్య విద్యలో 5ు కంటే తక్కువ మంది మాత్రమే సైక్రియాట్రీ వైపు వస్తున్నారని చెప్పారు. ఆసియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్స్‌ ప్రెసిడెంట్‌ (ఎలక్ట్‌) డాక్టర్‌ జి.ప్రసాద్‌ రావు మాట్లాడుతూ మన దేశంలో డిప్రెషన్‌తో ఉన్న ఓ రోగి చికిత్స తీసుకోవడానికి తమ దగ్గరకు రావడానికి 18 నెలలు పడితే, ఇప్పుడది 12 నెలలకు వచ్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనా ప్రకారం మన దేశంలో 38 మిలియన్ల మంది ఆందోళన సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 36.6ు ఇండియాలోనే జరుగుతున్నాయని ఆ సంస్ధ వెల్లడించిందన్నారు. మన దేశంలో ప్రస్తుతం 6 వేల మంది సైక్రియాట్రిస్ట్‌లు ఉండొచ్చన్న ఆయన ఈ సంఖ్య కనీసం ఐదు రెట్లు పెరగాలన్నారు. ‘యోగా, ప్రాణాయామం, ధ్యానంతో చాలావరకూ మానసిక సమస్యలను నివారించుకోవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, పౌష్టికాహారం (విటమిన్‌ సీ, డీ , బీ1, బీ2 అధికంగా ఉన్న పదార్ధాలు) తీసుకోవడంతో కొంతవరకు సమస్యను అధిగమించవచ్చు’ అని వివరించారు. 

 

చికిత్సకు అపోహలే అవరోధం

సైకియాట్రిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గౌతమ్‌ సాహా మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం విషయంలో అపోహలే చికిత్సకు ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయన్నారు. మన దేశంలో 1% మంది అంటే 1.4 కోట్ల మంది తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, వారిలో కేవలం 15% మంది మాత్రమే చికిత్స పొందుతున్నారన్నాని చెప్పారు. మన దేశంలో ఓ అంచనా ప్రకారం 10% మంది డిప్రెషన్‌, 38% మంది ఆందోళన, మూడింట రెండొంతుల మంది ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. ఆత్మహత్యల సంఖ్య 10% పెరిగిందని చెప్పారు. 


సదస్సులో తొలి రోజు

తొలి రోజు సదస్సులో న్యూరోగ్రాఫిక్‌ ఆర్ట్‌ థెరఫీ, ఆసియన్‌ సైకియాట్రీపై, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై కొవిడ్‌-19 ప్రభావం గురించి చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎన్‌ఎన్‌ రాజు, ఆశా హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ చైతన్య దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-17T09:13:13+05:30 IST