ఫ్యాషన్‌తో ప్రేమలో పడిపోయాను!

ABN , First Publish Date - 2021-03-11T04:58:40+05:30 IST

కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌ కావచ్చు... ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌ ఫంక్షన్‌ కావచ్చు...భారీ చిత్రం తాలూకు వేడుక కావచ్చు... అందరి కళ్ళూ సెలబ్రిటీల మీదా, వారు ధరించే దుస్తులూ, ఆభరణాల మీదా ఉంటాయి.వారి స్టైల్స్‌ మ్యాగజైన్లకు ముఖచిత్రాలవుతాయి

ఫ్యాషన్‌తో ప్రేమలో పడిపోయాను!

కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌ కావచ్చు... ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌ ఫంక్షన్‌ కావచ్చు...భారీ చిత్రం తాలూకు వేడుక కావచ్చు... అందరి కళ్ళూ సెలబ్రిటీల మీదా, వారు ధరించే దుస్తులూ, ఆభరణాల మీదా ఉంటాయి.వారి స్టైల్స్‌ మ్యాగజైన్లకు ముఖచిత్రాలవుతాయి. సోషల్‌ మీడియాలో వీడియోలు హల్‌చల్‌ చేస్తాయి. ఆ తారలు ఇలా ఆకర్షణీయంగా మెరిసేలా చేసేది స్టైలిస్ట్స్‌. ఆస్థా శర్మ వారందిరిలోకీ సెలబ్రిటీ. ఐశ్వర్యారాయ్‌, పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, తమన్నా, దిశాపటానీ... ఇలా ఎందరో స్టార్లకు స్టైలిస్ట్‌గా ఉన్న ఆమె తన గురించీ, తన సంస్థ ‘వార్డ్‌రోబిస్ట్‌’ గురించీ ఏమంటున్నారంటే...


ఎవరికి స్టైలింగ్‌ చేస్తున్నాం, ఏ సందర్భం కోసం చేస్తున్నాం, వాళ్ళు ఎలా కనిపించాలని అభిమానులూ, ప్రజలూ కోరుకుంటారు.. ఇవన్నీ నేను పరిగణనలోకి తీసుకుంటాను. ఇవే మా సంస్థకు పేరు తెచ్చాయి.


‘‘ఫ్యాషన్‌ నన్ను ఆకర్షించిన మొదటి సందర్భం నాకు బాగా గుర్తుంది. అప్పుడు నాకు పదకొండేళ్ళుంటాయి. మా అమ్మ కాలేజీ రోజుల ఫొటోలు ఉన్న ఆల్బమ్‌ నా కంటపడింది. బెల్‌ బాటమ్‌ జీన్స్‌, వివిధ రంగులు కలగలిసిన ప్రింటెండ్‌ టాప్‌లు, బ్లౌజ్‌లూ, చివర్లో బుట్టల్లా కనిపించే చీరెలూ, రకరకాల ముడుల హెయిర్‌ స్టైల్స్‌, ముదురు రంగుల్లో లిప్‌ స్టిక్‌లూ, పెద్ద పెద్ద సన్‌ గ్లాసెస్‌... ఇవన్నీ 1970ల నాటి ఫ్యాషన్లు. వాటితో నేను ప్రేమలో పడిపోయాను. అప్పటి నుంచీ రకరకాల ఫ్యాషన్లను పరిశీలించడం అలవాటయిపోయింది. ఇప్పుడు సెలబ్రిటీలకు స్టైలిస్ట్‌గా పని చెయ్యడానికి ఆ పరిశీలన ఎంతో ఉపయోగపడుతోంది. 


లాయర్‌ కావాలనుకున్నా...

నిజానికి ఫ్యాషన్‌ రంగంలోకి రావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నేను పుట్టిందీ, పెరిగింది ఢిల్లీలో. మా కుటుంబంలో అందరూ న్యాయవాదులే. మా నాన్న అడుగుజాడల్లో నేను కూడా లాయర్‌ కావాలన్నది నా చిన్ననాటి కోరిక. నేషనల్‌ లా స్కూల్‌ ప్రవేశ పరీక్షకు అప్లై చెయ్యడానికి సిద్ధమయ్యాను. కానీ ఒక రోజు మా నాన్న నన్ను పిలిచారు. ‘‘గ్రాడ్యుయేషన్‌ తరువాత నిజంగానే లా చదవాలనుకుంటున్నావా? లేదంటే నేను ఈ వృత్తిలో ఉన్నాను కాబట్టి న్యాయవాది కావాలనుకుంటున్నావా?’’ అని అడిగారు. ఆయన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. ఆ వృత్తిలో ఉన్న సాధకబాధకాలు ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నేను వేరే వృత్తిని ఎంచుకుంటే మంచిదని ఆయన భావిస్తున్నారేమో! నా సందిగ్ధాన్ని గమనించి, ‘‘మొదట గ్రాడ్యుయేషన్‌ పూర్తి చెయ్యి. ఆ తరువాత ఏ దారిలో వెళ్ళాలో నిర్ణయించుకో’’ అని నాన్న సూచించారు.


మధ్యలో మానేస్తానని చెప్పాను...

అప్పుడు నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుతున్నాను. ఏదైనా సృజనాత్మక వృత్తిలోకి వెళ్ళాలనే భావన నాకు అప్పుడే కలిగింది. క్రమంగా ఫ్యాషన్‌ రంగం మీద ఆసక్తి పెరిగింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే, ఫ్యాషన్‌ రంగానికి సంబంధించిన కోర్సులు ఆఫర్‌ చేస్తున్న ఒక ప్రైవేట్‌ కాలేజీలో చేరాను. ఫ్యాషన్‌ మార్కెటింగ్‌, మర్చెంటైజింగ్‌లో ఆరు నెలలు కోర్స్‌ తీసుకున్నాను. కానీ మెల్లగా విసుగు మొదలయింది. ఫ్యాక్టరీలు తిరగడం, అవి ఎలా పని చేస్తున్నాయో చూడడం తప్ప ఫ్యాషన్‌కి సంబంధించిన సృజనాత్మకత ఏదీ కనిపించలేదు. అందుకే ఆ కోర్సు మధ్యలో మానేద్దా మనుకుంటున్నానని చెప్పినప్పుడు మా కోర్సు కో-ఆర్డినేటర్‌ వద్దని చెప్పారు. ‘‘మొదట కోర్సు పూర్తి చెయ్యి. ఆ తరువాత అమ్మకాలనూ, మార్కెటింగ్‌నూ దాటి ఆలోచించు’’ అని సలహా ఇచ్చారు. అది నా జీవితంలో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. 


ఒకరోజు లైబ్రరీలో ఒక ఫ్రెండ్‌ను కలిశాను. మా మాటల్లో స్టైలింగ్‌ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పటికి మన దేశంలో స్టైలింగ్‌ చాలా కొత్త. దాని గురించి ఫ్యాషన్‌ రంగంలో ఉన్నవారిలోనే అవగాహన తక్కువగా ఉండేది. విదేశీ ఫ్యాషన్‌ పత్రికల తరహాలో మన దేశంలో కూడా మోడల్స్‌ను సరికొత్త స్టైల్స్‌తో ఫోటోలు తీసి ప్రచురించడం అప్పుడే మొదలవుతోంది. ఈ క్రమంలో నాకు రిన్‌ జాయో పరిచయం అయ్యారు. ఆయన ‘మాక్సిమ్‌’ పత్రికలో స్టైలిస్ట్‌. నా కోర్సు పూర్తి కాగానే ఆయన దగ్గర సహాయకురాలుగా చేరాను. మరో స్టైలిస్ట్‌ ఆదిత్య వాలియా దగ్గర కూడా అసిస్టెంట్‌గా ఉండేదాన్ని. మెల్లమెల్లగా పరిశ్రమలో పరిచయాలు పెరిగాయి. రెండేళ్ళ తరువాత సొంతంగా ఏదైనా చెయ్యాలనిపించింది. అలా దాదాపు పదేళ్ళ కిందట ‘వార్డ్‌రోబిస్ట్‌’ కన్సల్టెన్సీని ప్రారంభించాను. 


వీళ్ళందరూ నా క్లయింట్లే...

ఇప్పుడు నా క్లయింట్లలో ఐశ్వర్యారాయ్‌, పూజాహెగ్డే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సికా మోత్వానీ, టబూ, తమన్నా, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, జెనీలియా, శిల్పాశెట్టి, వాణీకపూర్‌, సోనాక్షీ సిన్హా, కాజోల్‌, యామీ గౌతమ్‌, భూమీ ఫడ్నేకర్‌, ప్రీతీజింటా, కృతీసనన్‌, దిశా పటానీ, సైఫ్‌ అలీఖాన్‌... ఇలా ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు. 2015 నుంచీ కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న పలువురికి నేను స్టైలింగ్‌ చేస్తున్నాను. అలాగే ఐశ్వర్యారాయ్‌కి ‘జజ్బా’ సినిమాలో, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఆమె మొదటి హాలీవుడ్‌ సినిమా ‘అకార్డింగ్‌ టూ మాథ్యూ’లో స్టైలింగ్‌ చేశాను. అమెజాన్‌ ప్రైమ్‌ లఘు చిత్రాలకూ, అనేక సౌందర్య ఉత్పత్తులకూ, పేనసోనిక్‌, కేసియో, ప్యూమా లాంటి బ్రాండ్లకు మా సంస్థ పని చేసింది. 


మనదైన ముద్ర ఉండాలంటే...

స్టైలింగ్‌ను పూర్తి స్థాయి వృత్తిగా తీసుకున్నవారిని అప్పట్లో వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. కానీ నేను ధైర్యం చేశాను. ఈలోగా మన దేశంలో అంతర్జాతీయ వస్త్రాలూ, అలంకరణ వస్తువుల బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీంతో పదేళ్ళ కిందట మార్పు మొదలయింది. ఏవైనా కార్యక్రమాలకూ, వేడుకలకూ వెళ్ళినప్పుడు అందరి దృష్టీ తాము ధరించే దుస్తుల మీదా, తమ స్టైల్‌ మీదా పడాలనే కోరిక సెలబ్రిటీల్లో పెరిగింది. మీడియా కూడా సెలబ్రిటీల కొత్త స్టైల్స్‌కు ఎక్కువ ప్రచారం ఇవ్వడం ప్రారంభించింది. దీనంతటికీ ముందుగానే నేను ఈ రంగంలో ఉండడంతో దేశంలో, విదేశాల్లో వస్తున్న కొత్త కొత్త మార్పులను మరింత అధ్యయనం చేశాను.


దుస్తులు, హెయిర్‌ స్టైల్‌, షూలు, ఆభరణాలు, హ్యాండ్‌ బ్యాగ్స్‌.. ఇలా ప్రతీదీ భిన్నంగా, వాటిదైన ప్రత్యేకతతో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎవరికి స్టైలింగ్‌ చేస్తున్నాం, ఏ సందర్భం కోసం చేస్తున్నాం, వాళ్ళు ఎలా కనిపించాలని అభిమానులూ, ప్రజలూ కోరుకుంటారు.. ఇవన్నీ నేను పరిగణనలోకి తీసుకుంటాను. ఇవే మా సంస్థకు పేరు తెచ్చాయి. నిఫ్ట్‌తో సహా దాదాపు అన్ని ఫ్యాషన్‌ కాలేజీలూ ఇప్పుడు స్టైలింగ్‌లో కోర్సులు అందిస్తున్నాయి. అయితే కేవలం కోర్సు చేస్తే చాలదు. మనం ఎంచుకున్న రంగంలో మనదైన ముద్ర వేయాలి. దానికి అవసరమైన నైపుణ్యం నిరంతర అధ్యయనం, పరిశోధనతోనే వస్తుంది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతమైన స్టైల్‌ ఉంటుంది, అయితే ఊహల్ని దానికే పరిమితం చేసుకోకూడదు. సృజనాత్మకత, కొత్త ధోరణుల్ని పసిగట్టే లక్షణం మనల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి.’’

Updated Date - 2021-03-11T04:58:40+05:30 IST