నాకు కరోనా రోగం వచ్చింది... నన్ను తాకొద్దు

ABN , First Publish Date - 2020-09-13T09:30:54+05:30 IST

‘నాకు గంట క్రితమే కరోనా రోగం అంటుకుంది. ఇక నేను మన ఇంటిపక్కనే పశువుల పాకలో ఉంటా. మీరు నన్ను తాకొద్దు..

నాకు కరోనా రోగం వచ్చింది... నన్ను తాకొద్దు

మీరు సల్లగుండాలె..! నేను ‘పాక’లో ఉంటా..

కోడలు, మనువడితో కన్నీళ్లు పెట్టిన గంటలోపే.. వృద్ధుడి ఆత్మహత్య


రామాయంపేట, సెప్టెంబరు 12 : ‘నాకు గంట క్రితమే కరోనా రోగం అంటుకుంది. ఇక నేను మన ఇంటిపక్కనే పశువుల పాకలో ఉంటా. మీరు నన్ను తాకొద్దు.. మీరు చల్లగుండాలె’ అంటూ ఇంట్లోవాళ్లతో నమ్మబలికి కన్నీటి పర్యంతమైన ఓ వృద్ధ రైతు తన ప్రాణం తీసుకున్నాడు. వైరస్‌ రిపోర్టు వచ్చిన వెంటనే ఇంటి అరుగుపై కూర్చొని ఏడవటాన్ని చూసిన కోడలు స్వరూప, మనుమడు వంశీ పరుగెత్తుకొచ్చి ఓదార్చారు. ఆ వెంటనే మీరు నన్ను ముట్టుకోవద్దు. దూరంగా ఉండాలి. ఇక నేను పాకలోకి వెళ్లిపోతున్నా అని చెప్పిన పావుగంటలోపే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం డీధర్మారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన బొద్దు ఎల్లయ్య (62) వ్యవసాయం చేస్తాడు. ఇతనికి భార్య సుగుణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.


మూడునాలుగు రోజులుగా జ్వరం రాగా అనుమానం వచ్చిన ఆయన.. శనివారం అదే ఊరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్‌ టెస్టు చేయించుకున్నాడు. సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలోనే వేచి ఉండగా.. వైద్య సిబ్బంది పిలిచి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. దీంతో అప్పటికే మనోవేదనతో పాటు జ్వరంతో బాధపడుతున్న ఎల్లయ్య.. ఇక తాను బతకొద్దన్న నిర్ణయానికొచ్చాడు. ఇంటిదాకా వెళ్లి బయటే కూర్చొని ఏడ్వసాగాడు. విషయం గమనించిన కోడలు, మనుమడు ఓదార్చారు. ‘తాతయ్య నీకేం కాదు.. మేమంతా లేమా’ అంటూ ధైర్యం చెప్పినా పశువుల పాకలోకి వెళ్లి ఉరేసుకుని తనువు చాలించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మహేందర్‌ గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


జిల్లాలో కొత్తగా 68 మందికి పాజిటివ్‌

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 12 : జిల్లాలో శనివారం 68 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు. మండలాల వారీగా పరిశీలిస్తే రామాయంపేట 13, తూప్రాన్‌ 11, నిజాంపేట 11, మెదక్‌ టౌన్‌ 9, వెల్దుర్తి 5, చిన్నశంకరంపేట 4, చేగుంట 3, కొల్చారం 3, మనోహరాబాద్‌ 2, పాపన్నపేట 2, రేగోడ్‌ 2, అల్లాదుర్గం, నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 


కరోనాతో వృద్ధుడి మృతి

మెదక్‌ రూరల్‌, సెప్టెంబరు 2 : మెదక్‌ మండలం రాజ్‌పల్లికి చెందిన ఓ వృద్ధుడు (65) కరోనాతో మృతిచెందాడు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడక మృతిచెందాడు. 

Updated Date - 2020-09-13T09:30:54+05:30 IST