Abn logo
Sep 22 2021 @ 02:08AM

ఐటీ దాడుల వెనుక ఎవరున్నారో తెలుసు!: సోనూసూద్

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఇరవై కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డానన్న ఆరోపణలతో తన ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కాస్త భిన్నంగా ఆలోచించి సమాజానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు అని తాను నమ్ముతానని పేర్కొన్నారు. తన ఫౌండేషన్‌కు విరాళాల రూపంలో వచ్చిన డబ్బులోంచి పైసా కూడా వృధా చేయలేదని స్పష్టం చేశారు. తాను వెచ్చించిన మొత్తంలో విరాళాల కన్నా, తన రెమ్యూనరేషనే ఎక్కువని పేర్కొన్నారు. 


ఆదాయపన్ను శాఖ అధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించడంపై ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.   ‘దేశ్‌ కీ మెంటార్‌’ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు.  ప్రజల ముఖాల్లో ఆనందాలను నింపేందుకు తనను ఎవరైనా పిలిస్తే అది ఏ రాజకీయ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వమా, గుజరాత్‌ ప్రభుత్వమా, బిహార్‌ ప్రభుత్వమా అని చూడకుండా వెళ్తానని స్పష్టంచేశారు. రూ.18.94 కోట్ల విరాళాలల్లో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయనే దానికీ బదులిచ్చారు. 


ఈ డబ్బు ఖర్చు పెట్టేందుకు 18 నిమిషాలు చాలన్నారు. అయితే ప్రతి సమస్య వాస్తవమైనదేనా? అన్న కోణంలో తమ బృం దం పరిశీలిస్తుందని, క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీస్తుందని,  సా యానికి వెచ్చించిన ప్రతి పైసా వృధా కాలేదన్నారు. విరాళాల్లో ఏమీ వృధా కాలేదని జనాలు నమ్ముతారని పేర్కొన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ తన ఫోండేషన్‌ ఎఫ్‌సీఆర్‌ఏ కిందకు రాదని చెప్పారు. అయినా తాను విదేశాల నుంచి పైసా కూడా విరాళంగా తీసుకోలేదన్నారు. విరాళాలన్నీ క్రౌడ్‌ ఫండిగ్‌ ప్లాట్‌ఫాంలోనే ఉన్నాయని, ఆ నిధులు భారత్‌కు వచ్చినప్పుడే కాదా ఉల్లంఘన జరిగిందా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేది అని సూద్‌ ప్రశ్నించారు. సమస్యలను బట్టి ఆ సొమ్ము నేరుగా ఆస్పత్రులకు, విద్యా సంస్థలకే వెళుతుందని, అలాంటప్పుడు ఉల్లంఘన అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు. మున్ముందు సోనూ సోద్‌ లేకపోయినా సహాయ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.