ఎస్‌ఐ.. జడ్జి.. మధ్యలో 'ఐలవ్‌యూ'

ABN , First Publish Date - 2020-09-12T22:07:32+05:30 IST

అర్థరాత్రి ఆమె మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఐలవ్‌ యూ అని ఉంది. ఆ మెసేజ్‌ చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇదేదో లవ్‌ స్టోరీలా ఉందే అనుకుంటున్నారా.....

ఎస్‌ఐ.. జడ్జి.. మధ్యలో 'ఐలవ్‌యూ'

అర్థరాత్రి ఆమె మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఐలవ్‌ యూ అని ఉంది. ఆ మెసేజ్‌ చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇదేదో లవ్‌ స్టోరీలా ఉందే అనుకుంటున్నారా.. అక్కడే తప్పులో కాలేశారు. ఆ మెసేజ్‌ వచ్చింది ఓ మహిళా ఎస్ఐకి.. ఇంతకీ పెట్టిందెవరో తెలుసా.. ఎవరో ఆకతాయి మాత్రం కాదు.. ఓ పెద్ద అధికారి. విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.


అర్ధరాత్రి వేళ తనకు ఐలవ్ యూ అని మెసేజ్ పంపారని ఓ మహిళా ఎస్ఐ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే అవతలి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఎవరా అని విచారిస్తే ఆయనో పేరుమోసిన న్యాయమూర్తి. న్యాయాన్ని కాపాడాల్సిన మీరా ఇలా చేసేది.. ఛి.. ఛీ.. అని పోలీసులు కూడా ముక్కున వేలేసుకున్నారు. అయితే జడ్జి మాత్రం తనకేం తెలియదని, తన ఇంటి పనిమనిషి కావాలనే ఆ మెసేజ్ పంపివుండొచ్చని చెబుతున్నాడు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.


ఆగస్టు 30 తెల్లవారుజామున అమ్రేలీ జిల్లా స్థానిక ఎస్ఐకి ఓ మెసేజ్‌ వచ్చింది. 'గుడ్ మార్నింగ్, మిస్ యూ డియర్, లవ్ యూ టూ' అనేది ఆ సందేశం సారాంశం. తన మొబైల్‌లో ఈ సందేశం చూసిన ఆ ఎస్‌ఐ షాక్‌ తిన్నారు. ఆ నంబర్‌ కూడా తనకు తెలియదు. దీంతో ఆమె వెంటనే ఆ నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి సెషన్ కోర్టు అదనపు న్యాయమూర్తి అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు.


అవతలి వ్యక్తి న్యాయమూర్తి అని తెలిసిన తరువాత ఆమె ఆగ్రహం రెట్టింపైంది. అర్ధరాత్రి వేళ ఐలవ్ యూ అంటూ సందేశాలు పంపడమేంటని నిలదీశారు. అయితే తానేం అలాంటి సందేశాలను పంపలేదని, తన ఇంటి పనిమనిషి పని అయి వుంటుందని జడ్జి సమాధానమిచ్చారు. కానీ 'మీ ఫోన్ నుంచి పనిమనిషి ఎలా మెసేజ్‌లు పంపుతుందం'టూ ఎస్‌ఐ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని ఆ మహిళా ఎస్ఐ అధికారులను కోరారు. ఏది ఏమైనా ఓ మహిళా ఎస్‌ఐకి జడ్జి మొబైల్‌ నుంచి అలాంటి సందేశాలు రావడం విచారించాల్సిన విషయమే. జడ్జిగారే స్వయంగా ఈ మెసేజ్‌లు పంపారా... లేక ఆయన చెబుతున్నట్లు నిజంగానే తన పనిమనిషే ఈ మెసేజ్‌లు పంపి ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టారా.. అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఈ కేసు ఏ వైపు వెళుతుందో వేచి చూడాలి.

Updated Date - 2020-09-12T22:07:32+05:30 IST