Abn logo
Mar 22 2020 @ 04:17AM

ఐఫోన్‌ చూపించి... నకిలీ ఫోన్‌ అంటగడతారు

 పట్టుబడిన అంతర్రాష్ట్ర గ్యాంగ్‌

ఆరుగురి అరెస్ట్‌.. మూడు వాహనాలు స్వాధీనం


బేగంపేట,  మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఒంటరిగా వెళ్లే వారిని గమనిస్తారు... ఇద్దరు వారివద్దకువెళ్లి తమ వద్ద ఖరీదైన ఐ ఫోన్‌ ఉందని డబ్బులు అవసరం ఉన్నందున తక్కువకు అమ్ముతున్నానంటూ నమ్మబలుకుతారు. వారి మాటలు నమ్మి ఐఫోన్‌ కొనేందుకు ఒప్పుకోగానే ఎంత ఉంటే అంత ఇవ్వండంటూ తీసుకుని ఐ ఫోన్‌కు బదులు నకిలీ ఫోన్‌ ఇచ్చి పరారవుతారు. ఇలా నగరంలోని నాలుగు చోట్ల ఐఫోన్‌ పేరుతో మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను బేగంపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి మూడు ద్విచక్రవాహనాలతో పాటు 1.10లక్షల రూపాయల నగదు, ఫోన్‌కు వాడే మూడు పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బేగంపేట పోలీ్‌సస్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరే్‌షరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.


ఉత్తరప్రదేశ్‌కు చెందిన అఫ్తాబ్‌, మనీష్‌, ఫిరోజ్‌, జుబేర్‌, షారుఖ్‌, షాహిద్‌ ఈ నెల 3న నగరానికి వచ్చారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు. అనంతరం తమకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా మూడు ద్విచక్రవాహనాలను తెప్పించారు. ఓ నకిలీ  ఫోన్‌ను గ్లాస్‌తో తయారుచేయించి పౌచ్‌లో పెట్టారు. అనంతరం ఈ నెల 9వ తేదీన తిరుమలగిరిలో రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌ వద్ద వీరు మూడు వాహనాలపై వచ్చారు. నలుగురు దూరంగా ఉండగా, ఇద్దరు సమీపంలో ఉన్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి తమ వద్ద ఐఫోన్‌ ఉందని, రూ.50వేలు ఖరీదు ఉంటుందని, రూ.20వేలకు ఇస్తామని నమ్మించారు. సదరు వ్యక్తి రూ.20వేలు ఇవ్వగానే గ్లాస్‌తో తయారుచేయించి పౌచ్‌లో పెట్టిన నకిలీ ఫోన్‌ను అతనికి ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం 11వ తేదీన శ్రీనగర్‌ కాలనీలోని కర్ణాటక బ్యాంక్‌ వద్ద వీరు పథకం ప్రకారం వేచి ఉన్నారు. ఓ వ్యక్తిని గమనించి తమ వద్ద ఐఫోన్‌ ఉందంటూ ఒరిజినల్‌ ఐఫోన్‌ను చూపించారు.రూ.15వేలు ఇస్తే ఇస్తామని నమ్మబలికారు. బాధితుడు రూ.15వేలు ఇవ్వగానే నకిలీ ఫోన్‌ అతనికి ఇచ్చి పరారయ్యారు. 14వ తేదీన తిరుమలగిరి పరేడ్‌గ్రౌండ్‌ వద్ద ఓవ్యక్తి వేచి ఉండగా అతని వద్దకు వెళ్లి ఒరిజినల్‌ ఐఫోన్‌ను చూపించారు.


ధర రూ.60వేలు ఉంటుందని అర్జెంట్‌గా డబ్బు అవసరం కావడం వల్ల రూ.20వేలకు ఇస్తానని నమ్మబలికారు. తన వద్ద అంత లేదని రూ.12వేలు ఉన్నాయని చెప్పడంతో రూ.12వేలు తీసుకుని నకిలీ ఫోన్‌ను చేతిలో పెట్టి పరారయ్యారు. అదే రోజు సాయంత్రం గ్రీన్‌ల్యాండ్స్‌ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డులో ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ఐఫోన్‌ చూపించారు. ఈ ఫోన్‌ 69,900 రూపాయలు ఉంటుందని, రూ.50వేలకు ఇస్తామని నమ్మబలికారు. తన వద్ద అంతలేదని రూ.10వేలు ఉన్నాయని బాధితుడు చెప్పడంతో ఆ పది వేలు తీసుకుని నకిలీ ఫోన్‌ను ఇచ్చి పరారయ్యారు. వీరు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌లోని జీడిమెట్ల, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, చార్మినార్‌, మెహింజా మార్కెట్‌, వెంగళరావునగర్‌, మూసాపేట, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్‌పై పలు నేరాలు ఇదే తరహాలో చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు రసూల్‌ఫురా క్రాస్‌రోడ్‌లో డీఐ, డీఎ్‌సఐలు తమ సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా మూడు వాహనాలపై వెళ్తున్న ఆరుగురు అనుమానాస్పదంగా కనబడడంతో వీరిని అదుపులోనికి తీసుకుని విచారించగా వివరాలు తెలిశాయన్నారు. వీరి  నుంచి మూడు ద్విచక్రవాహనాలు, 1.10 లక్షల నగదు, మూడు నకిలీ గ్లాస్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  వీరిపై 420,379 ఐపీసీ సెక్షన్‌ల కింద     కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ నరే్‌షరెడ్డి  తెలిపారు. 

Advertisement
Advertisement